రైతుల కోసం నిరంతర పోరు: అవినాశ్ రెడ్డి

పులివెందుల:

పులివెందుల బ్రాంచ్ కెనాల్ ఆయకట్టు రైతుల కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతోందని ఆ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు వైఎయస్ అవినాశ్ రెడ్డి చెప్పారు. మంగళవారం పులివెందులలోని శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయకట్టుదారుల సంఘం నాయకుడు చప్పిడి రమణారెడ్డి, మరికొందరు రైతులు వచ్చి పీబీసీకి జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరారు. స్పందించిన ఆయన రైతుల తరపున పోరాడేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. అనంతరం వైయస్ అవినాశ్ రెడ్డి, జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు, షర్మిల పాదయాత్ర సమన్వయ కమిటీ సభ్యుడు దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి, సింహాద్రిపురం మండల కన్వీనర్ పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ పీబీసీకి సంబంధించి నీరు తీసుకొచ్చేందుకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిందన్నారు. ఇందుకోసం పులివెందుల నుంచి అనంతపురం వరకు పాదయాత్ర చేసినట్లు గుర్తు చేశారు. ఐఏబీ కేటాయింపులను కూడా అమలు చేయకుండా పులివెందుల రైతులపై నిర్లక్ష్యం చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ సైతం పీబీసీ నీటికోసం కృషి చేశారన్నారు.

ఐక్యంగా పోరాడాలి
పులివెందుల బ్రాంచ్ కెనాల్ నీటి కోసం రైతులంతా కలిసి పోరాడాలనీ, వారికి తమ పార్టీ సహకారిస్తుందనీ అవినాశ్ రెడ్డి తెలిపారు. ఎలాంటి కార్యచరణ ప్రకటించినా మద్దతిచ్చేందుకు తమ పార్టీ ముందు వరుసలో ఉండి ఉద్యమాన్ని నడిపిస్తుందని హామీ ఇచ్చారు. మొద్దునిద్రలో ఉన్న ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని పీబీసీకి ఐఏబీలో కేటాయించిన నీటిని సీబీఆర్‌కు చేరేలా చర్యలు తీసుకొని అక్కడ నుంచి కెనాల్‌కు విడుదల చేయించి చీనీ తోటలను కాపాడాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో పులివెందుల తాలుకా అధికార ప్రతినిధి చవ్వా సుదర్శన్‌రెడ్డి, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top