రైతన్న కడుపు కొడుతున్న ప్రభుత్వం

 పెద్ద కడుబూరు(మంత్రాలయం): మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం గురువారం సాయంత్రం నాలుగు గంటలకు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని పెద్ద కడుబూరు చేరుకుంది. వేల సంఖ్యలో హాజరైన ప్రజలకు ఆమె అభివాదం చేశారు. మీ రాజన్న కూతుర్ని..జగనన్న చెల్లెల్ని.. నా పేరు షర్మిల అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. నా పేరు అనగానే హాజరైన ప్రజలు 'షర్మిల' అంటూ ఎలుగెత్తి చెప్పారు.  ప్రజలు ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. మిద్దెలు, చెట్టు ఎక్కి మరీ ప్రసంగాన్ని విన్నారు. వైయస్ఆర్ జీవించి ఉంటే కర్నూలులో ఎల్ ఎల్ సీ  పనులను పూర్తిచేసి ఉండేవారని షర్మిల చెప్పారు. మూడేళ్ళుగా ప్రభుత్వం వైయస్ పథకాలకు తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. ప్రజల మనసుల్లో వైయస్ ను దోషిగా నిలబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. అందుకే ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు చేర్చారని వివరించారు. ఒక్క సాక్ష్యం లేకపోయినా విచారణ పేరుతో జగన్ ను జైలులో ఉంచారని తెలిపారు. జగనన్న ఏ తప్పూ చేయలేదని ఆమె స్పష్టంచేశారు. త్వరలో జగన్ నిర్దోషిగా బయటకొస్తారని చెప్పారు. చంద్రబాబు తన హయాంలో గ్రామాలను శ్మశానాలుగా మార్చారనీ, ఇప్పుడు పాదయాత్ర పేరుతో మొసలి కన్నీరు కారుస్తూ ప్రజల ముందుకు వెడుతున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలను ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నప్పుడు టీడీపీ చోద్యం చూస్తుండి పోయిందన్నారు. ఇప్పుడు చంద్రబాబుకు పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదనీ, అవిశ్వాసం పెట్టి దుర్మార్గపు ప్రభుత్వాన్ని దించేయవచ్చనీ ఆమె చెప్పారు. అలా చేయకుండా ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని షర్మిల ధ్వజమెత్తారు. రాజన్నకూ, జగనన్నకూ ఉన్నది విశ్వసనీయతని ఆమె పేర్కొన్నారు. బాబుకు లేనిదీ.. రాజన్నకూ, జగనన్నకూ ఉన్నదీ మాట మీద నిలబడే తత్త్వమనీ షర్మిల తెలిపారు. జగనన్న బయట ఉంటే తమ దుకాణాలు మూసుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్, టీడీపీలు భయపడుతున్నాయన్నారు.

బాబు శిలా ఫలకం వేసి మరిచారు
రాజన్న పూర్తిచేశారు

        ఈ ప్రాంతంలో నలబై వేల ఎకరాలకు నీరివ్వాలని మహానేత భావించారని షర్మిల చెప్పారు.  గురు రాఘవేంద్ర సాగునీట ప్రాజెక్టుకు చంద్రబాబు శిలాఫలకం వేసి మరిచిపోతే, వైయస్ఆర్ పూర్తిచేశారని తెలిపారు. ఆయనే ఉండి ఉంటే ప్రస్తుతం రైతులు ఎంతో హర్షించేవారన్నారు. ఈ ప్రాంతంలో సాగుకు నీళ్ళు లేవనీ, పంటలు పండడం లేదనీ రైతులు చెపుతున్నారన్నారు. డాక్టర్ వైయస్ఆర్ సాగుకు ఏడు గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చారని చెప్పారు. ఆయన 2009లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విద్యుత్తు ఫైలుపైనే సంతకం చేసిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు.  అధికారంలోకి వచ్చిన వెంటనే మహానేత రూ. పన్నెండు వేల కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలను మాఫీ చేసిన అంశాన్నీ షర్మిల ప్రస్తావించారు. అప్పట్లో రుణాలు లేని వారికి అప్పులు ఇప్పించారని తెలిపారు. 
       ప్రస్తుత ప్రభుత్వం రైతన్న కడుపుపై కొడుతోందని ధ్వజమెత్తారు. 'ఇప్పుడు అన్నింటి ధరలూ పెరిగాయి. పంట నష్టపోతే పరిహారం ఇచ్చే దిక్కు లేదు. వైయస్ఆర్ మరణించిన సమయంలో వచ్చిన వరదలకు నష్టపోయిన రైతులకు అప్పట్లో ప్రకటించిన పరిహారాన్ని ఇంతవరకూ ఇవ్వలేదు.' అంటూ షర్మిల వివరించారు.  మహిళలను  మహానేత తోబుట్టువుల్లా చూసుకున్నారని తెలిపారు. వారిని లక్షాధికారులను చేయాలనుకురనీ, అందుకోసమే  పావలా వడ్డీపై రుణాలిప్పించారని పేర్కొన్నారు. ప్రస్తుత తరుణంలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. చక్కెర కిరోసిన కూడా అందకుండా చేశారని తెలిపారు. ఎరువులపై సబ్సిడీ లేదనీ, ఉచిత విద్యుత్తు లేదనీ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ఆర్ జీవించి ఉంటే ఈరోజు ముపై కిలోల బియ్యం ఇచ్చేవారని తెలిపారు. 
     
సర్కారుది పెద్ద మనసు కాదు
     ఇప్పటి ప్రభుత్వానికి పెద్ద మనసు లేదని షర్మిల ఆరోపించారు. ఉపాధి హామీ, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్సుమెంటు పథకాల అమలును ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. వైయస్ఆర్ హయాంలో ఉపాధి హామీ పథకం అద్భుతంగా అమలయ్యిందన్నారు.  కూలీలకు రోజు రూ. 125 చెల్లించేవారని చెప్పారు. ఇప్పుడు రోజుకు 25, 30 రూపాయలు చెల్లిస్తున్నారట. అయినా తప్పనిసరి పరిస్థితిలో ఆ పనికి వెడుతున్నారు. మన రాష్ట్ర ప్రజలు ఎంత పేదరికంలో ఉన్నారో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలని షర్మిల చెప్పారు. మహానేతకు విద్యార్థులంటే ఎంతో ఇష్టమనీ, వారు చదువుకోడానికి ఫీజు రీయింబర్సుమెంటు పెట్టారని వివరించారు. ఆ పథకంలో  చదువుకున్న వారు ఇప్పుడు పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. వైయస్ఆర్  ఆరోగ్యశ్రీ పథకంలో  సామాన్యుడు కూడా పెద్ద ఆపరేషన్లు చేయించుకునేలా చేశారని చెప్పారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం అమలు కావడం లేదన్నారు. సామాన్యులను ప్రభుత్వాస్పత్రికే పంపుతున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్న వారు తమకు అనారోగ్యం చేస్తే కార్పొరేట్ ఆస్పత్రికో, విదేశాలకో వెడతారని చురకవేశారు. జగనన్న అధికారంలోకి వస్తారనీ, అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తారనీ షర్మిల చెప్పారు. అప్పుడు అందరూ చదువుకోవచ్చని తెలిపారు. పర్యటనలో షర్మిల వెంట వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి పాల్గొన్నారు. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కూడా ఈ పర్యటనలో ఆమె వెంట ఉన్నారు.

Back to Top