హైదరాబాద్, 21 డిసెంబర్ 2012: నేడు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి 40వ పుట్టినరోజు. జననేత శ్రీ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పార్టీ కార్యకర్తలు, అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. గురువారం అర్ధ రాత్రి కేక్ కట్ చేసి వారంతా శ్రీ జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కొన్ని చోట్ల సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ యువజన, విద్యార్థి విభాగాలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో పలుచోట్ల రక్తదాన శిబిరాలు, పండ్లు, దుప్పట్ల పంపిణీ, మొక్కలు నాటే కార్యక్రమాలు, అన్నదానం నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సేవా కార్యక్రమాలతో పాటు పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డిని అక్రమంగా జైలులో నిర్బంధించినందుకు ఆయా విభాగాలు నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించేందుకు సన్నద్ధమయ్యాయి.శ్రీ జగన్ పుట్టిన రోజును పురస్కరించుకొని గుంటూరులో అభిమానులు, పార్టీ శ్రేణులు, నాయకులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక షిర్డీ సాయి దీన దయాళ్ అంధుల పాఠశాలలో కేక్ కట్ చేశారు. విద్యార్థులకు పార్టీ నేతలు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. జగన్మోహన్ రెడ్డి త్వరలోనే ప్రజల మధ్యకు వస్తారని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.