రాష్ట్రవ్యాప్తంగా మహాధర్నా విజయవంతం

హైదరాబాద్, 26 సెప్టెంబర్‌ 2012: విద్యుత్, ఆర్టీసి బ‌స్సు ఛార్జీల పెంపునకు నిరసనగా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మహాధర్నా విజయవంతం అయింది. అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్ల వద్ద ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ధరల పెరుగుదలకు నిరసన తెలిపారు. సామాన్యుల నడ్డి విరిస్తున్న సర్కారీ విధానాలపై పార్టీ నాయకులు మండిపడ్డారు. ఆర్టీసీ చార్జీల పెంపు సామాన్యులకు గుది బండేనని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున ధర్నాలో పాల్గొన్నారు. ‌ముఖ్యంగా మహిళలు ఈ ధర్నాల్లో అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం.

విజయనగరం‌లోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు, జిల్లా ఇన్‌ఛార్జి పెన్మత్స సాంబశివరాజు, జిల్లా పరిశీలకుడు రవిబాబు, విజయ్ పాల్గొనర్నారు. పెంచిన ఛార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. 
ఏలూరు కలెక్టరే‌ట్ వద్ద  వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు, విద్యు‌త్ స‌ర్‌ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
‌-
కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి : 
పెంచిన ఆర్టీసీ ఛార్జీలు, విద్యుత్ స‌ర్ ఛార్జీలు తగ్గించాలంటూ బుధవారం ఏలూరు కలెక్టరే‌ట్ వద్ద ‌వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ మహాధర్నా చేపట్టింది. ధర్నాలో ఎమ్మెల్యే బాలరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ వై‌యస్ ఉన్నంతకాలం ఒక్క రూపాయి కూడా ప్రజలపై భారం మోపలేదన్నారు. ఆయన మరణం తర్వాత ప్రజలపై వరుస భారం మోపుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయని ఎమ్మెల్సీ శేషుబాబు అన్నారు.
‌నిజామాబాద్ రైల్వేకమా‌న్ వద్ద  వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలను పోలీసులు అరె‌స్టు చేశారు. 
అనంతపురం కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యే గురునాథరెడ్డి, తోపుదుర్తి కవిత, ‌పార్టీ జిల్లా కన్వీనర్ శంక‌ర్ నారాయణ పాల్గొన్నారు. ఈ జిల్లాలోని రొద్దంలో మండల రైతులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ చిత్తూరు జిల్లా నగరిలో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ధర్నా నిర్వహించింది. మండుటెండను సైతం లెక్కచేయక పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున ఆందోళనలో పాల్గొన్నారు. చార్జీలు పెంచడమే పనిగా పెట్టుకున్న సర్కారు తీరుపై పార్టీ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ పాలనలో పేదవాడి బతుకు దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఖమ్మం బస్టాండ్ ఎదుట వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. పెంచిన ఛార్జీలను ప్రభుత్వం వెంటనే తగ్గించకపోతే ... రానున్న ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెబుతారని ఆ పార్టీ నేతలు హెచ్చరించారు. సామాన్యులపై భారం మోపడం ఇకనైనా మానాలని హితవు పలికారు. గుంటూరుజిల్లాలోనూ పార్టీ నేతలు రాస్తారోకోలు నిర్వహించారు.

ఆదిలాబాద్ ధర్నా‌:
పెరిగిన ధరలకు నిరసనగా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. విద్యుత్ ఛార్జీలు, బ‌స్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో పార్టీ జిల్లా కన్వీన‌ర్ బోడ జనార్ద‌న్, కో కన్వీన‌ర్ రవిప్రసా‌ద్, అని‌ల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Back to Top