రానున్నది వైయస్ఆర్‌ కాంగ్రెస్ ప్రభంజనం

హైదరాబాద్:

రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన ప్రభంజనం సృష్టించబోతోందని ప్రముఖ సిద్ధాంతి మారేపల్లి రామచంద్రశాస్త్రి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 230 అసెంబ్లీ స్థానాలకు తక్కువ కాకుండా గెలుస్తుందని  పేర్కొన్నారు. విజయ నామ సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకుని గురువారం ఆయన వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పూజలు నిర్వహించి, పంచాంగ పఠనం చేశారు. సార్వత్రిక ఎన్నికల తరువాత కేంద్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పడుతుందనీ, ఈ పార్టీ అనుగ్రహం లేకుండా ఏ వ్యక్తీ ప్రధాన మంత్రి కాలేరనీ స్పష్టంచేశారు. గ్రహ గతుల ఆధారంగా తాను ఈ అంశాలు చెబుతున్నానని పేర్కొన్నారు.

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకారంతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది కనుక గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రానికి ఉపకారాలు పొందే అవకాశం కలుగుతుందన్నారు. కుట్రలు, కుతంత్రాలు ఎంతో కాలం కలిసి ఉండలేవనీ,  ఏదో ఒక రోజు విడిపోతాయని ఆ తరుణం కోసం ఎదురు చూడాలనీ సూచించారు. వైయస్ఆర్ కాంగ్రెస్‌పై పోటీ చేయడం ఆత్మహత్యా సదృశంగా ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు భావిస్తున్నారనీ, మహా ప్రభంజనం ముందు ప్రాణాలొడ్డడం ఎందుకనుకుంటున్నారనీ వ్యాఖ్యానించారు. జాతక రీత్యా శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డికి గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయనీ, ఆయన త్వరలో బయటకు వచ్చి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తూ తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళతారనీ తెలిపారు.

ప్రజల పక్షాన ఉన్నవారిదే విజయం
‘కేంద్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చి తీరతాయి. రకరకాల కూటములు, కొత్త ఫ్రంట్‌లు ఏర్పడే అవకాశం ఉంది. భాగస్వామ్య పార్టీలతో విభేదించి కూటములు మారుతుంటారు. ప్రజల పక్షాన ఉన్న వారినే విజయం వరిస్తుంది. రాష్ట్ర ప్రజలు ఈ ఏడాది పలు కష్టనష్టాలకు గురైనా అంతిమంగా సుఖశాంతులు పొందుతారు. ప్రకృతి వైపరీత్యాలు రాష్ట్రానికి కొత్తేమీ కాదు.. రాష్ట్రానికి ఇబ్బందులు అంతగా ఉండవు. గ్రహ గతుల ప్రకారం సూర్యచంద్రులు కలిస్తే అమావాస్య(చీకటి) వస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి సూర్యచంద్రులు కలిసి పోయారా? అన్నట్లుగా ఉంది. సూర్యచంద్రులు సమదూరంలో ఉంటే పౌర్ణమి వస్తుంది. అది అందరికీ ఆహ్లాదకరమైనది. ప్రజలంతా సాధారణ ఎన్నికల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ అమావాస్యను ఎంత కాలం భరించాలి? పౌర్ణమి రావాలని కోరుకుంటున్నారు.

ప్రజలు చల్లగా ఉండాలి: విజయమ్మ
దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఉగాది పండుగలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారని శ్రీమతి విజయమ్మ గుర్తు చేసుకున్నారు. తాము ఎపుడైనా ఇల్లు మారాల్సి వచ్చినపుడు ఉగాది పండుగ తరువాత వచ్చే శుభప్రదమైన రోజున మారదామని చెప్పేవారన్నారు. విజయనామ సంవత్సరంలో ప్రజలందరికీ మేలు జరిగి చల్లగా ఉండాలనీ, ఆయురారోగ్యాలతో విలసిల్లాలనీ, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. వైయస్ఆర్ కాంగ్రెస్  శాసన సభాపక్షం ఉపనేత భూమా శోభానాగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సూర్యచంద్రులు కలిసి పోయినట్లుగా ఉన్నారని... కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై సాగిస్తున్న చీకటి పాలన మాదిరిగా పరిస్థితి ఉందన్నారు. తొలుత శ్రీమతి విజయమ్మ జ్యోతిని వెలిగించి ఉగాది ఉత్సవాలను ప్రారంభించారు. ఎన్ని కష్టాల్లో ఉన్నా శ్రీమతి విజయమ్మ ప్రజల కోసం తపన పడటాన్ని ఆమెకు దగ్గరగా ఉండే తమలాంటి వారు చూసి ఆవేదన చెందుతుంటామని కానీ ఆమె మాత్రం నిబ్బరంగా ఉంటారని శోభ అన్నారు. జగన్ బయట ఉంటే ఉగాది ఇంకా ఆనందోత్సాహాలతో జరుపుకునే వాళ్లమన్నారు. తాను శ్రీ జగన్‌ను కలిసినప్పుడల్లా ప్రజల కోసం పోరాటాలు చేయాలని చెబుతున్నారని తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top