పిడుగురాళ్ళ (గుంటూరు జిల్లా), 13 అక్టోబర్ 2012:
పిడుగురాళ్ల ప్రజల దాహార్తిని తీర్చేందుకు పులిచింతల ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలంటూ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి శుక్రవారం నిర్వహించిన పాదయాత్రకు విశేష స్పందన లభించింది. గుంటూరు జిల్లాలోని గోవిందపురం నుంచి పిడుగురాళ్ల వరకు 20 కిలోమీటర్ల మేర కొనసాగిన ఈ యాత్రలో స్థానిక ప్రజలు కదంతొక్కారు. తాగునీటిని తరలించేందుకు మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి రూ. 38 కోట్లు మంజూరు చేసినా పనులు పూర్తిచేయటంలో ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాత్ర ముగిసిన అనంతరం శుక్రవారం సాయంత్రం పిడుగురాళ్లలో నిర్వహించిన బహిరంగసభకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు.
పులిచింతల ప్రాజెక్టును వెంటనే పూర్తిచేయాల్సిన ఆవశ్యకత ఉందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కోసమే తాము ఈ పాదయాత్ర చేపట్టినట్లు జంగా కృష్ణమూర్తి వివరించారు. దివంగత నేత డాక్టర్ రాజశేఖరరెడ్డి ఏ ఉద్దేశంతో అనుమతిని మంజూరు చేశారో అది నెరవేరాలంటే పులిచింతల ప్రాజెక్టును త్వరితంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకూ తాము ఉద్యమం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అందులో భాగంగానే తాము గోవిందపురం నుంచి పిడుగురాళ్ళ వరకూ పాదయాత్ర నిర్వహించినట్లు చెప్పారు.