'ప్రతిపక్ష పాత్రలో తెలుగుదేశం పార్టీ విఫలం'

హైదరాబాద్‌, 30 అక్టోబర్‌ 2012: రాష్ట్రంలో అసలైన ప్రతిపక్షం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీయే అని చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లి టిడిపి ఎమ్మెల్యే ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి అభివర్ణించారు. ప్రతిపక్ష పార్టీగా టిడిపి పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ప్రజల నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు వమ్ము చేశారని దుయ్యబట్టారు. ‌మహానేత డాక్టర్ వైయస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని, వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని ఇబ్బందుల పాలు చేయడానికే అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష టిడిపిలు ఒక్కటయ్యాయని ఆయన దుయ్యబట్టారు. వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని మంగళవారం నాడు చంచల్‌గూడ జైలులో కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 
త్వరలోనే మంచిరోజు చూసుకుని తాను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరతానని ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడంపై తాను దృష్టి పెడతానని చెప్పారు. వైయస్‌ఆర్‌ కుటుంబమే లక్ష్యంగా టిడిపి పనిచేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయాల కోసమే కాంగ్రెస్‌, టిడిపిలు ఏకమయ్యాయని ఆరోపించారు. జగన్‌ను తాను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నట్లు ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. 
తెలుగువాడు, తెలుగుజాతి, తెలుగువాడి సమైక్య అభివృద్ధి కోసం, కాంగ్రెస్ వ్యతిరేక పునాదుల మీద టిడిపి ఏర్పాటైందని ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైనప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా నిలదీసి, ప్రతిపక్ష పాత్ర పోషించమని 90 సీట్లు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలు టిడిపిని అసెంబ్లీకి పంపించారన్నారు. అలాంటి‌ది తనకు ఉన్న సమయాన్ని, ప్రతిపక్ష హోదాను ఉపయోగించుకుంటూ ఈ రోజు వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీతో కలిసి టిడిపి పనిచేస్తోందని విమర్శించారు. ప్రజల సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్‌, టిడిపిలు రాష్ట్రాన్ని అనాథగా వదిలేశాయన్నారు.
జైలులో కష్టాల్లో ఉన్న యువనేత జగన్‌కు మద్దతుగా నిలిచి, సంఘీభాం తెలిపేందుకే ఒక యువ రాజకీయ నాయకుడిగా చంచల్‌గూడ జైలుకు వచ్చానన్నారు. ఈ రాష్ట్రానికి సమర్ధుడైన మంచి నాయకుడు రావాల్సిన అవసరం ఉందన్నారు. వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అలాంటి సమర్ధుడైన నాయకుడని ఆయన అభివర్ణించారు.

తాజా వీడియోలు

Back to Top