ప్రజలకు భరోసానిస్తున్న మరో ప్రజాప్రస్థానం

అనంతపురం:

జననేత వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో నిర్వహించిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్రతో ప్రజలకు భరోసా లభించిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే బి. గురునాథరెడ్డి చెప్పారు. అనంతపురం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ.. కాంగ్రెస్‌తో కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తోందన్నారు. ఈ తరుణంలో షర్మిల పాదయాత్ర చేపట్టారన్నారు. యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందన్నారు. వైయస్ఆర్ హయాంలో ఎన్నో సమస్యలు తీరాయని, ఇవాళ ఆ పరిస్థితి లేదని ప్రజలు విన్నవించుకున్నారని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్తు సర్చార్జీల పేరిట పెద్దఎత్తున బిల్లులు వేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతోందని దుయ్యబట్టారు. సీఎం కిరణ్ ఇందిరమ్మ బాట అంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాదయాత్ర ముమ్మాటికీ అధికారం కోసమేనన్నారు. అందులో పార్టీ నాయకులు, కార్యకర్తలే తప్ప ప్రజలెవరూ పాల్గొనడం లేదన్నారు. వైయస్ఆర్ సీపీ సీఈసీ సభ్యుడు వై. విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ వైయస్ పథకాల అమలులో ప్రభుత్వ డొల్లతనాన్ని షర్మిల బహిర్గతం చేశారన్నారు. హంద్రీ-నీవా, పీఏబీఆర్, తాగునీటి సమస్యలను షర్మిలతో పాటు వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రధానంగా ప్రస్తావించారని గుర్తు చేశారు. తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారన్నారు. షర్మిల పాదయాత్రలో ప్రజలు వేల సంఖ్యలో పాల్గొని హారతులు పట్టడం శుభపరిణామమన్నారు.

Back to Top