ప్రజలకు అండగా వైయస్ఆర్ కాంగ్రెస్ నిలుస్తుంది

ఎన్టీఆర్ నగర్(హయత్ నగర్) 04 మే 2013:

ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్ని ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం స్పందించడం లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణాపురం డివిజన్లోని ఎన్టీఆర్ నగర్ లోని తమ  ఇళ్ళను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు చేపట్టిన నిరశన దీక్షకు ఆమె సంఘీభావం తెలిపారు. స్థానిక కార్పొరేటర్ డి. సురేఖ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్షలకు పూనుకున్నారు. ఈ శిబిరాన్ని సందర్శించిన విజయమ్మ అనంతరం ఏర్పాటైన సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కిరణ్ సర్కారు ప్రలా రంగంలో విఫలమయిందని విమర్శించారు. సర్చార్జీల పేరుతో సామాన్యులపై మోయలేని భారం మోపిందన్నారు. వైయస్ఆర్ ఇచ్చిన హామీలను ప్రస్తుత ప్రభుత్వం తుంగలో తొక్కిందని  ఆరోపించారు.

గుడిసెలేని రాష్ట్రం కోసం దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ శ్రమించారన్నారు.  ఇందులో భాగంగా 80 లక్షల ఇళ్ల నిర్మాణం చేట్టారనీ, 47 లక్షల ఇళ్లు పూర్తి చేశారనీ ఆమె తెలిపారు. ఎన్‌టీఆర్‌నగర్ ఇళ్లను క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తమ పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.  ఒకవేళ ప్రభుత్వం స్పందించకుంటే తాము అధికారంలోకి వచ్చాక ఇళ్ల క్రమబద్దీకరణ చేపడతామని శ్రీమతి విజయమ్మ భరోసానిచ్చారు.
ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన అమ్మ హస్తం మాయ హస్తంగా మారిందని శ్రీమతి విజయమ్మ విమర్శించారు. 104,  108 సర్వీసులను నిర్వీర్యం చేశారన్నారు. ప్రజా సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని ఆరోపించారు. ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు దక్కవన్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశానికంటాయన్నారు. గ్యాస్ ధర అందనంత ఎత్తుకు పెరిగిందన్నారు. రాష్ట్ర ప్రజల బాధలు తీరాలంటే రాజన్న రాజ్యం రావాలని ఆమె అభిలషించారు. తమ పార్టీ ప్లీనరీలో ప్రకటించిన ప్రతి అంశాన్నీ నెరవేరుస్తుందన్నారు.

Back to Top