ప్రజల కంట్లో పొడిచి ఆనందిస్తున్నారు

  
నేర్జాంపల్లి(వైయస్ఆర్ జిల్లా): ఈ ప్రభుత్వం ప్రజల కంట్లో పొడిచి ఆనందిస్తోందని వైయస్ షర్మిల ధ్వజమెత్తారు. నేర్జాంపల్లిలో ఐదో రోజు మరో ప్రజాప్రస్థానం ముగించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం, చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.  కనీసం కరెంటు ఇవ్వడం లేదనీ, పేదవాడికి ఆరోగ్యశ్రీ అందకుండా పోయిందనీ విమర్శించారు. అధికారంలో ఉండగా ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడు రైతుల కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన హయాంలో నాలుగువేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా పాదయాత్ర ఎందుకు చేస్తున్నారని ఆమె చంద్రబాబును ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యి తెలుగుదేశం పార్టీ జగనన్నను జైలులో పెట్టించారని ధ్వజమెత్తారు. రైతులను కాల్చిన పోలీసులను పరామర్శించిన చరిత్ర ఆయనదన్నారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందన్నారు. 
ఐదో రోజు యాత్రలో షర్మిల పులివెందుల బ్రాంచ్ కెనాల్ ను షర్మిల పరిశీలించారు. దీనికింద సాగు చేసే రైతులు తమ బాధలు చెప్పుకున్నారు. ఇటీవల జరిగిన తుంగభద్ర బోర్డు సమావేశంలో  పాల్గొన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఈ కాల్వకు నీరు విడుదల చేయాలని కోరిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఆందోళన కూడా చేశారన్నారు. పార్టీ నేత అవినాష్ రెడ్డి పాదయాత్ర కూడా చేపట్టారని చెప్పారు. మరో ప్రజా ప్రస్థానం ఐదో రోజు యాత్ర పులివెందుల నియోజకవర్గంలోని లోపట్నూతల నుంచి ప్రారంభమైంది. కర్ణపాపాయపల్లెలో ఏర్పాటైన కార్యక్రమంలో ఓ శతాధిక వృద్ధురాలితో షర్మిల ముచ్చటించారు. జగన్ వల్లే తనకు పింఛను వచ్చిందని ఆమె పేర్కొన్నారు. గ్రామస్థులు ప్రభుత్వ విధానాలపై దుమ్మెత్తిపోశారు. షర్మిల తమ ఊరు రావడం ఆనందంగా ఉందన్నారు.
అంతకు ముందు వెల్లిదండ్లలో ఏర్పాటైన కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడించారు. ఎం. సౌజన్య అనే విద్యార్థి  మాట్లాడుతూ తాను రాజశేఖరరెడ్డి ముద్దుబిడ్డనని చెప్పింది. ఆయన ఇచ్చిన ఉచిత విద్యుత్తు, విద్య కారణంగానే చదువుకోగలుగుతున్నానని తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానన్నారు. కరెంటు లేక ఇబ్బందిగా ఉందనీ, జగన్ ముఖ్యమంత్రయితే ఇబ్బందులు తీరుతాయని చెప్పారు. ఓ మహిళ పులివెందుల పులిబిడ్డ వైయస్ఆర్ అని నినదించింది. జగన్ కు బెయిలు రావాలని ఆకాంక్షించింది. ఫీజు రీయింబర్సుమెంటు పథకం తనకెంతో తోడ్పడిందని ఓ విద్యార్థి చెప్పారు. ఎమ్సీఏ చదువుతున్నాననీ, తొలి ఏడాది 27 వేల రూపాలయలు రీయింబర్సుమెంటు వచ్చిందన్నారు. ఈ ఏడాది వస్తుందోరాదో తెలీకుండా ఉందన్నారు. తన తండ్రి ఆరోగ్య బాగో లేకపోయినపుడు ఆరోగ్యశ్రీ ఆదుకుందన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే ఇక్కట్లు తీరతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.  


తాజా వీడియోలు

Back to Top