ప్రజల బారులు .. షర్మిలకు జేజేలు

మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా పాదయాత్ర చేస్తున్న మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన వైయస్ షర్మిల పత్తికొండ నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 25వ రోజు షర్మిల పాదయాత్ర చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పత్తికొండ నియోజకవర్గంలో సాగిన పాదయాత్ర మధ్యాహ్న భోజనాలు పూర్తయిన తరువాత ఆలూరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. ఆలూరు నియోజకవర్గం ఇన్‌చార్జి గమ్మనూరి జయరాం నేతృత్వంలో ప్రజలు పాదయాత్రకు ఎదురు వచ్చి ఆలూరు నియోజకవర్గంలోకి ఆహ్వానించారు.

కర్నూలు:

భారీ ఎత్తున వాహనాల్లో ప్రజలు తరలిరాగా, మధ్యాహ్నం తరువాత ఆదోని రోడ్డు జనసంద్రంగా మారింది. ఆస్పరి మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరం నుంచే షర్మిలతో కలిసి వేలాది మంది పాదయాత్రలో పాల్గొన్నారు. ఇక ఆస్పరిలో బహిరంగసభ ఏర్పాటు చేసిన నాలుగురోడ్ల కూడలి కిక్కిరిసిపోయింది. జనం చేతులూపుతూ, కేరింతలు కొడుతూ షర్మిలకు నీరాజనాలు పట్టారు. ఇదే ఊపు షర్మిల బస చేసే చిరుమానుదొడ్డి వరకు సాగింది.
 మరో ప్రజాప్రస్థానంలో భాగంగా వైఎస్ షర్మిల 25వ రోజు జిల్లాలోని పత్తికొండ శివారు నుంచి ఆలూరు నియోజకవర్గం లోని చిరుమానుదొడ్డి వరకు 15.2 కి.మీ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆస్పరి మండల కేంద్రంలో పార్టీ ఇన్‌చార్జి గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీల తీరుపై నిప్పులు చెరిగారు. హంద్రీనీవా మొదటి దశ పనులు పూర్తయితే జిల్లాలోని అనేక వెనుకబడ్డ ప్రాంతాల ప్రజలకు సాగునీరు అందేదని పేర్కొన్నారు. మూడేళ్లుగా పట్టించుకోకుండా జిల్లాలో తన పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి హుటాహుటిన ప్రారంభోత్సవాలకు వస్తున్నారని సీఎం, మంత్రి రఘువీరారెడ్డిలపై విరుచుకుపడ్డారు. హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ కాలువల కింద రిజర్వాయర్లకు తుంగభద్ర నుంచి నీటిని విడుదల చేయించలేని దీనావస్థలో ప్రభుత్వం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

బాబు మాటలకూ.. చేతలకూ పొంతన లేదు

     చంద్రబాబు పాదయాత్ర పేరుతో చెపుతున్న మాటలకు, చేతలకు పొంతన లేదని విమర్శించారు. అసలు అయనకు తాను ఒక ఎన్నికల్లో ఏం చెప్పాడో మరో ఎన్నికల నాటికి గుర్తుండదని ఎద్దేవా చేశారు. ఆస్పరిలో అధికంగా టమోటా పండించే రైతులు గిట్టుబాటు ధర లేక పండించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టమోటా పండించిన రైతులు కూడా రోడ్డుపైన పడేస్తున్నారని అన్నారు. జగన్ సీఎం అయితే ఆస్పరిలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి ప్రభుత్వమే రైతుల నుంచి టమోటా కొంటుందని హామీ ఇచ్చారు. ఈ సభలో పార్టీ ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, బాల నాగిరెడ్డి, మాజీ మంత్రి మారెప్ప, మాజీ ఎమ్మెల్యేలు గౌరుచరితా రెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్.వి. మోహన్ రెడ్డి, జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, పార్టీ నియోజకవర్గం నాయకుడు తెర్నేకల్లు సురేందర్ రెడ్డి, ఇతర నియోజకవర్గాల ఇన్‌చార్జిలు కోట్ల హరిచక్రపాణి రెడ్డి, ఎ.వి. సుబ్బారెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఎర్రబోతుల వెంకటరెడ్డి, బుగ్గన రాజారెడ్డి, కర్రా హర్షవర్ధన్ రెడ్డి, ఇతర నాయకులు రమాదేవి, డాక ్టర్ మధుసూదన్, నిడ్జూరు భూపాల్ రెడ్డి, పోచా జగదీశ్వర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top