ప్రజాస్వామ్యవాదులైతే పార్టీని రద్దు చేయండి

హైదరాబాద్‌, 24 నవంబర్‌ 2012: తెలంగాణవాదాన్ని అడ్డుపెట్టుకుని ఇతర పార్టీలు, వ్యక్తులను దూషించడం సరికాదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు హితవు పలికారు. తెలంగాణ ప్రాంతంలో వైయస్ఆ‌ర్ కాంగ్రె‌స్ పార్టీ‌ పట్ల వ్యక్తమవుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ఆ పార్టీ నేతలు వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని గట్టు ఆరోపించారు. వైయస్‌ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో శనివారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డిని దూషించిన పార్టీలు కనుమరుగయ్యాయని, అదే వైఖరి తీసుకుంటే టీఆ‌ర్‌యస్‌కు అదే గతి పట్టడం ఖాయమని గట్టు అన్నారు. టీఆర్‌యస్ నేతలు ప్రజాస్వామ్య వాదులైతే పార్టీని రద్దు చేసి తెలంగాణ వాదంతో ముందుకు రావాలని ‌ఆయన సవాల్ ‌చేశారు. 

నిజానికి తెలంగాణ వాదాన్ని నీరుగార్చుతున్నది టీఆర్‌యస్ పార్టీయే‌ అని గట్టు రామచంద్రరావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలతో టీఆర్‌యస్ నేతలు కలిసినపుడే ప్రజలు ఈ విషయాన్ని గ్రహించారన్నారు. తెలంగాణలో వైయ‌స్ఆ‌ర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పాదయాత్రపై ప్రజలకు ‌వివరిద్దామని టీఆర్ఎ‌స్ నేత కేటీఆ‌ర్ లేఖ రాయడం మంచిదేనని గట్టు అన్నారు. ఆ లేఖలోని వ్యక్తిగత దూషణలు చూస్తే టీఆ‌ర్ఎ‌స్ నేతల వైఖరి ఏ‌మిటో వెల్లడైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు తెలంగాణలో ప్రజాభిమానం తగ్గుతున్నదనే భయంతో పాటు వలసలను ఆపుకోవడాని‌కే కేటీఆర్ లేఖ రాశారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌లో ఫ్లకార్డు పట్టుకున్నప్పుడు వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి ఏ పార్టీలో ఉన్నారు, ఆ తర్వాత తెలంగాణపై తన వైఖరిని ఏ విధంగా ప్రజలకు వివరించారో టీఆర్ఎ‌స్ నేతలు గ్రహించాలని గట్టు సూచించారు.
వారసత్వ రాజకీయాలపై మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎ‌స్ అధినేత చంద్రశేఖ‌రరావుకు లేదని గట్టు రామచంద్రరావు అన్నారు. అమెరికాలో ఉన్న తన కుమారుడు కేటీఆర్‌ను రప్పించి వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నది కేసీఆరే అన్నారు. తెలంగాణ ఉద్యమం పేరుతో దోచుకున్నదంతా కేటీఆర్ దాచిపెడుతున్నారని గట్టు ఆరోపించారు.‌

కిరణ్ రెండేళ్ల పాలనలో జరిగింది శూన్యం:
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రెండేళ్ల పాలనలో ఈ రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదని గట్టు రామచంద్రరావు ఎద్దేవా చేశారు. ఈ రెండేళ్ళలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వం కేవలం దివంగత మహానేత రాజశేఖరరెడ్డి ఇమేజ్‌ని దెబ్బతీయడానికి తప్ప మరెందుకూ వినియోగించలేదని గట్టు విమర్శించారు. గడచిన రెండేళ్ల కాలంలో రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను తుంగలో తొక్కేశారని దుయ్యబట్టారు. భారం పడినపుడు తప్ప సంక్షేమ పథకాల అమలులో ఈ ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించడంలేదన్నారు.
Back to Top