'ప్రజా సమస్యలపై పోరాడమని జగన్‌ చెప్పారు'

హైదరాబా‌ద్, 9 ఏప్రిల్‌ 2013: ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేయమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తనతో చెప్పారని పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేయమని సూచించారని ఆయన తెలిపారు. జైలులో ఉన్నప్పటికీ ఆయన చాలా ధైర్యంగా ఉన్నారన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ప్రసన్నకుమార్‌రెడ్డి మంగళవారం కలిశారు. అనంతరం ప్రసన్న కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, చాలా రోజుల తర్వాత శ్రీ జగన్‌ను కలిశానని చెప్పారు.

కాంగ్రెస్‌ చేతిలో సిబిఐ కీలుబొమ్మలా మారిందని ప్రసన్నకుమార్‌రెడ్డి ఆరోపించారు. శ్రీ జగన్‌ను అణగదొక్కాలని చూస్తోందని ఆయన విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఏ ముఖ్యమంత్రి కొడుకూ ఇప్పటి వరకు అధికార పార్టీని ధైర్యంగా వ్యతిరేకించిన దాఖలాలు లేవని చెప్పారు. సోనియాకు తలవంచి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.
Back to Top