హైదరాబాద్, 28 ఆగస్టు 2013:
చంచల్‌గూడ జైలు వద్ద వైయస్ఆర్ కాంగ్రెస్ మహిళల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న నిరంకుశమైన తీరుకు నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న ఆమరణ నిరామార దీక్షకు మద్దతుగా రంగారెడ్డి జిల్లా మహిళలు పూలతో ప్రదర్శన నిర్వహించారు. జైలు వద్ద నిరసన తెలిపేందుకు వీలు లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారిపై జులుం ప్రదర్శించారు. దాంతో పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా 150 మంది మహిళలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. దీనితో చంచల్‌గూడ జైలు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
అరెస్టు అయిన వారిలో పార్టీ నాయకుడు సురేష్‌రెడ్డి, మహిళా విభాగం కన్వీనర్ అమృతసాగర్, ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, ఈసీ శేఖర్‌గౌడ్, మూలా హరీష్‌గౌడ్, సుదర్శన్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, శ్రీహరి, సురేష్‌గౌడ్, బాల్‌రెడ్డి, సునీత, టి. సుజాత ఉన్నారు.
నిర్బంధంలో ఉన్నా జనం కోసం దీక్ష చేపట్టిన శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డికి అన్ని వర్గాల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. శ్రీ జగన్‌కు మద్దతు తెలిపేందుకు ఆయన అభిమానులు ప్రతిరోజూ వేలాది మంది చంచల్గూడ జైలు వద్దకు తరలివస్తున్నారు. వారిని పోలీసులు జైలు సమీపంలోకి కూడా రానివ్వకపోవడంతో వారు నిరాశతో వెనుతిరుగుతున్నారు. జైలు ప్రధాన ద్వారం వద్ద గత నాలుగు రోజులుగా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ముళ్ల కంచెలు వేశారు.