పీటీఐ తన కథనాన్ని వెనక్కి తీసుకోవాలిదుష్ప్రచారాన్ని వెంటనే ఆపాలిలేదంటే చట్టపరమైన చర్యలు తప్పదు
హైదరాబాద్, 7 సెప్టెంబర్ 2012: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అవకాశాలను వైయస్ విజయమ్మ తోసిపుచ్చలేదంటూ పీటీఐలో వచ్చిన వార్తా కథనాన్ని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆ వార్త అత్యంత హేయమైనదిగా ఖండించింది. ఈ మేరకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారంనాడు ఒక ప్రకటన విడుదల చేసింది.
‘విజయమ్మ వ్యాఖ్యలను యథాతథంగా ప్రచురిస్తే అభ్యంతరం లేదు. కానీ దానికి తనకు నచ్చినట్టుగా పీటీఐ భాష్యం చెప్పటం కుట్ర పూరితమైన వ్యవహారం’ అని తీవ్రంగా ఆక్షేపించింది. ఆ కథనాన్ని రాసిన పీటీఐ ప్రతినిధి వాస్తవాలను యథేచ్ఛగా వక్రీకరించాడని, ఆ వార్తా కథనం శీర్షికే దాన్ని ధ్రువీకరిస్తోందని అభిప్రాయపడింది. ‘వైయస్‌ఆర్‌సీపీ ఎన్నటికీ ఏ పార్టీలోనూ విలీనమయ్యే ప్రశ్నే తలెత్తదని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ కచ్చితంగా తెలుసు. అలాంటప్పుడు ఇలాంటి కుట్రపూరిత కథనాలను ఎందుకు వండి వార్చిందో పీటీఐ సమీక్షించుకోవాలి’ అని కోరింది.
ఇదే అదనుగా ఎల్లో మీడియాలోని చంద్రబాబు చానళ్లు ఈ అసత్య కథనానికి విస్తృత స్థాయిలో ప్రాముఖ్యం ఇవ్వడం చూస్తుంటే, ఇది కుట్రపూరితమేనన్న తమ అభిప్రాయం సరైనదేనని ఎవరికైనా అర్థమవుతుందని పార్టీ పేర్కొంది. ఆ కథనాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, దుష్ప్రచారాన్ని ఆపాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పార్టీ ఆ ప్రకటనలో హెచ్చరించింది.