పెద్ద చదువులు పేదల హక్కు: విజయమ్మ

హైదరాబాద్‌, 6 సెప్టెంబర్‌ 2012: పెద్ద చదువులు... పేదల హక్కుగా భావించిన మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారని వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై‌యస్ విజయమ్మ అన్నారు. ‌పరిమితుల పేరుతో పేద విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఈ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రభుత్వం ఎందుకు భారంగా భావిస్తోందో అర్థం కావటం లేదని విజయమ్మ అన్నారు. అర్హులైన విద్యార్థులందరికీ ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌ పథకాన్ని వర్తింపచేయాల‌ని ఆమె గురువారం ఇందిరాపార్క్ వద్ద రెండు రోజుల నిరాహార దీక్ష ‌ప్రారంభించారు. ఈ  దీక్షా వేదిక నుంచి విజయమ్మ మాట్లాడుతూ, వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎలాంటి పరిమితులు లేకుండా అర్హులైన పేదలందరికీ ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌ పథకాన్ని వర్తింపచేసినట్లే ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

నిరు పేదలు.. చదువులకు పేదలు కారాదని భావించిన వైయస్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ప్రతిభ ఉన్నప్పటికీ డబ్బులు లేని విద్యార్థులపై పరిమితుల పేరుతో ఆంక్షలు విధించటం సరికాదని విజయమ్మ అన్నారు. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌ కోసం ప్రభుత్వం ఏమన్నా తన జేబులో నుంచి డబ్బులు తీసి ఇస్తోందా? అని విజయమ్మ మండిపడ్డారు. ప్రజల నుంచి ఆ ప్రభుత్వం పెద్ద ఎత్తున పన్నులు వసూలు చేస్తోందని, దేశ భవష్యత్‌ను నిర్దేశించే విద్యార్థుల చదువుల కోసం ఖర్చు పెట్టేందుకు మాత్రం మీనమేషాలు లెక్కిస్తోందని దుయ్యబట్టారు. వైయస్లా ఆలోచిస్తే సామాజిక విప్లవం వస్తుందని విజయమ్మ అన్నారు. గతంలో ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌ అమలుపై వై‌యస్ జగన్ దీక్ష చేపట్టిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

పేద విద్యార్థుల బాధను గమనించే వైయస్‌ఆర్ ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌ పథకాన్ని తీసుకొచ్చారని ఆమె తెలిపారు. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌ పథకం‌ అమలుపై ప్రతి ఒక్కరికి అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ప్రతి ఒక్కర్నీ ఉన్నత చదువులు చదివించడం ప్రభుత్వం బాధ్యత అని వైయస్ అనేవారని విజయమ్మ తెలిపారు. వై‌యస్‌ఆర్ ఉన్నప్పుడు విద్యార్థులు ఎంతో ధైర్యంగా ఉండేవారని చెప్పారు. కాలేజీ యాజమాన్యాలు కూడా ‌ఆయనపై ఎంతో నమ్మకంగా ఉండేవని అన్నారు. వైయస్ ‌మరణించిన తర్వాత విద్యార్థులు టెన్షన్‌తో బతకాల్సిన దుస్థితి వచ్చిపడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వేలకు వేల రూపాయల ఫీజులు పేద విద్యార్థులు ఎలా చెల్లిస్తారని వైయస్ విజయమ్మ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నీరుగారుస్తోందని మండిపడ్డారు. వైయస్‌లా ఆలోచిస్తే సామాజిక విప్లవం వస్తుందని విజయమ్మ అన్నారు.

Back to Top