పరువు నష్టం దావా వేస్తాం

హైదరాబాద్ 06 మార్చి 2013:

టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు కొత్త సంప్రదాయానికి తెరదీశారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జి. శ్రీకాంత్ రెడ్డి  చెప్పారు. ఇప్పటిదాకా ఆస్తులు పెంచుకోవడానికి బినామీలను పెట్టుకున్న ఆయన ఇప్పుడు వైయస్ఆర్ కుటుంబంపై ఆరోపణలకు బినామీలను ఏర్పాటుచేసుకున్నారని ఎద్దేవా చేశారు. బ్రదర్ అనిల్ కుమార్‌పై అసత్య ఆరోపణలకు చేస్తున్న వారందరిపై పరువునష్టం దావా వేస్తామని  వెల్లడించారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లడారు. రాజకీయాలలో ప్రజాదరణ ఉన్న వ్యక్తులపైనేతేనేమీ ఆ కుటుంబంపైనైతేనేమీ ఈ మధ్యన భారీ ఎత్తున బురద జల్లుతున్నారని  ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజలు తమను నమ్మడం లేదని గ్రహించిన కొందరు ఇతర పార్టీల వ్యక్తులను ఎంచుకుని మరీ బురద జల్లే కార్యక్రమాన్ని చేపడుతున్నారని ధ్వజమెత్తారు. తమను తప్పుదోవ పట్టించడమే వీరి ఉద్దేశమని ప్రజలు గమనించారన్నారు. గతంలో దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరరెడ్డిగారిపైనా, జగన్మోహన్ రెడ్డిగారిపైనా ఎన్ని విమర్శలూ, ఆరోపణలూ చేసినప్పటికీ ఉప ఎన్నికలలో వారికి ఓటర్లు డిపాజట్లు కూడా రాకుండా చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
     తాజాగా శ్రీమతి షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్‌పై ఆరోపణలు ప్రారంభించారని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. శ్రీమతి షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు వెల్లువలా తరలి వస్తున్న ప్రజలను చూసి  వివిధ పార్టీల నాయకులు కుళ్ళుకుంటున్నారనీ, అందుకే తాజాగా బ్రదర్ అనిల్ కుమార్‌ను లక్ష్యం చేసుకున్నారనీ ఆయన వివరించారు. ఆరోపణలు చేయడమే తమ నైజమన్న దోరణిలో వారున్నారు. తనపై చేసిన ఆరోపణలకు బ్రదర్ అనిల్ స్పందిస్తూ తాను అక్రమాలకు పాల్పడలేదని బిడ్డల మీద, బైబిల్ మీద ప్రమాణం చేసి చెబుతున్నాననీ, ఆరోపణలు చేసేవారు అలా ప్రమాణం చేస్తారా అని ప్రశ్నిస్తే బదులు లేదని ఎద్దేవా చేశారు. టీవీ 5 చానెల్లో మంగళవారం బ్రదర్ అనిల్ తనపై కొందరు చేస్తున్న ఆరోపణలకు బదులిచ్చారనీ,  కొండలరావు అనే వ్యక్తి  తనను ఒకటి రెండు సార్లు కలిసి ఉండవచ్చనీ, అంతమాత్రం చేత అతనని నా బినామీ అని ఎలా అంటారనీ, అంత అవసరం తనకు లేదనీ, అసలు రక్షణ స్టీల్సుతోనే తనకు సంబంధం లేదనీ స్పష్టంచేశారని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాదరణ ఉన్న వ్యక్తులపై దుష్ప్రచారం సాగించాలనేదే వీరి ఆలోచనగా కనిపిస్తోందని మండిపడ్డారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ కుటుంబ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడమే వారు తమ లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు.


కోటిరూపాయలతో స్టాన్‌ఫోర్డులో ఎలా?
      రాజశేఖరరెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉండగా చేపట్టిన సంక్షేమ పథకాలను తాము కొనసాగిస్తామని తాము చెప్పుకుంటున్నాము తప్పితే ఇలాంటి దొంగచాటు కుట్రలు చేయడం లేదని శ్రీకాంత్ రెడ్డి స్పష్టంచేశారు.  చంద్రబాబు కుమారుడు లోకేష్ తాను చెప్పాల్సినవి హైటెక్ విధానంలో ట్విటర్లో తాను చెప్పాల్సినవి చెబుతుంటారనీ, నగదు బదిలీ పథకాన్ని తానే ప్రవేశపెట్టానని అంటున్నారన్నారు. తాను అనేక మార్పులు తెస్తానని చెబుతూ ఆరోపణలకు కూడా దిగుతున్నారన్నారు.  ఇన్ఫోసిన్ అధినేత నారాయణమూర్తి తన కుమారుణ్ణి స్టాన్‌ఫోర్డు విశ్వవిద్యాలయంలో చదివించుకోవడానికి 32 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టానని ఓ విలేకరుల సమావేశంలో స్వయంగా చెప్పారని తెలిపారు. చంద్రబాబునాయుడు తన కుమారుణ్ణి అక్కడ చదివించుకోడానికి కోటి రూపాయలు ఖర్చు చేసినట్లు తన రికార్డులలో పేర్కొన్నారన్నారు. ఇలాంటి అంశాలపై ఎందుకు విచారణ చేపట్టడం లేదో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. లోకేష్‌కు వచ్చిన మార్కులతో మన రాష్ట్రంలో కూడా ఎమ్‌.బి.ఎ. సీటు వచ్చే అవకాశం లేదన్నారు. లోకేష్ మేథస్సును గుర్తించి స్టాన్‌ఫోర్డు యూనివర్శిటీలో సీటెల ఇచ్చారో తమకర్థంకావడం లేదన్నారు.  లోకేష్ సీటుకు అంత డబ్బు ఎలా కట్టారో చెప్పాలని శ్రీకాంత్ రెడ్డి అడిగారు. సత్యం రామలింగరాజుగారు కట్టారా.. ఇంకెలా కట్టారో తేల్చాలన్నారు. ఇంత డబ్బు కట్టడానికి తన ఆస్తులు ఎలా అభివృద్ధి చెందాయో చంద్రబాబు చెప్పాలన్నారు. తల్లి అమ్మణ్ణమ్మ తన కుమారుడు లోకేష్‌కు ఐదెకరాలు పొలం ఇచ్చిందని చంద్రబాబు చెబుతున్నారన్నారు. జూబ్లీ హిల్సులో ఉన్న భవనాన్ని కూడా తన నానమ్మే ఇచ్చిందని లోకేష్ చెబుతున్నారన్నారు. ఆయన డిగ్రీకి ఎంత ఖర్చయ్యిందీ, ఎమ్.బి.ఎ. చదవడానికి అవసరమైన సొమ్ము ఎక్కణ్ణుంచి వచ్చిందీ, ఎలా వచ్చిందీ చెప్పాలని ఆయన చంద్రబాబును డిమాండు చేశారు. తన వద్దే ఇన్ని అక్రమాలు పెట్టుకుని ఇతరులు తప్పులు ఎలా చేశారని అడగడం సరికాదన్నారు. బాలాయిపల్లిలో లోకేష్‌కు ఉన్న భూములెలా వచ్చాయో కూడా చంద్రబాబు చెప్పాలన్నారు. తన దగ్గర ఎక్కువై-న డబ్బులతో ఈ భూముల్ని కొనిచ్చారని చెబుతున్నారన్నారు. వీటినీ, మీరు చెబుతున్న లెక్కలనూ  పరిశీలిస్తే మీ నిజాయితీ ఏమిటో చెప్పకనే వెల్లడవుతుందని ఆక్షేపించారు.

హెరిటేజ్ షేర్ల అమ్మకాన్ని వివరించగలరా!
     హెరిటేజ్ షేర్ల అమ్మకం గురించి అందరికీ తెలుసన్నారు. వీటి గురించి చంద్రబాబు వివరించగలరా అని ప్రశ్నించారు. ఒకవేళ ఏమైనా విచారణలు వస్తే రకరకాల మార్గాల్లో నిలిపివేయించుకుంటారని ఎద్దేవా చేశారు. చిదంబరంతో చీకటి ఒప్పందాలు తదితరాలు దీనికి ఉదాహరణలన్నారు. తొమ్మిదేళ్ళలో తానేం చేశానో ప్రజలకు వివరించే ధైర్యం కూడా చంద్రబాబు లేదన్నారు. హైటెక్ సిటీ ప్రారంభించానని చెబుతున్న చంద్రబాబుకు 1995-2004 మధ్యలో వచ్చిన ఐటీ బూమ్ కారణంగానే రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి చెందిందన్న విషయం తెలీదన్నారు. ఆయన స్థానంలో బాబూ మోహన్ ముఖ్యమంత్రిగా ఉన్నా ఇంకా బాగా చేసేవారని పేర్కొన్నారు. ప్రజలకు, రైతులకు ఉపయోగపడేలా చేసిన పథకం ఒక్కటి లేదన్నారు. కనీసం రాయితీలు ఇచ్చిన చరిత్ర కూడా చంద్రబాబుకు లేదని శ్రీకాంత్ ధ్వజమెత్తారు.

నోరుందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడవద్దు
     మహానేత డాక్టర్ వైయస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రైతులకు, పరిశ్రమలకూ నిరంతరం విద్యుత్తు ఇస్తూ అభివృద్ధికి దోహదపడ్డారన్నారు. ఈ మూడేళ్ళలో వచ్చిన విద్యుత్తు కోతలకు రాజశేఖరరెడ్డిగారే కారణమని చంద్రబాబు అనడం దారుణమన్నారు. నోరుందికదాని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ అంశాలపై విచారణకు సిద్ధపడతారా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. చంద్రబాబు ఏం మాట్లాడినా, బహిరంగ సభ వేదిక ఎక్కినా ఆయనకు కేవలం రాజశేఖరరెడ్డి గారినే లక్ష్యంగా చేసుకుంటున్నారని చెప్పారు. తల్లిని, కుమారుణ్ణి పెట్టుకున్న చంద్రబాబు చేస్తున్న మనీలాండరింగ్‌కు సమాధానం చెప్పాలన్నారు. దీనిమీద విచారణకు సిద్ధపడతారా అని సవాలు విసిరారు. అది మాని డాక్టర్ వైయస్ఆర్ గారినీ, ఆయన కుటుంబాన్నీ లక్ష్యంగా చేసుకోవడం తగదన్నారు. ఇతర పార్టీలనుంచి బినామీ వక్తల్ని ఎంచుకుని కూడా ఆరోపణలు చేయించడం కూడా సరికాదన్నారు.  ఒకవైపు రైతులు వేసిన పంటలు చేతికందక, చేతికందిన పంటకు గిట్టుబాటు లేక అష్టకష్టాలూ పడుతున్నారని శ్రీకాంత్ చెప్పారు. చంద్రబాబు తనకున్న పొలం ద్వారా ఇంత ఆదాయాన్ని ఎలా పొందుతున్నారో చెబితే మేము దాన్ని ప్రచారం చేసి రైతుల్లో సన్నగిల్లుతున్న ఆశలను చిగురింపజేస్తామని చెప్పారు.
బ్రదర్ సవాలు స్వీకరించగలరా!
     బ్రదర్ అనిల్ చేసిన సవాలును ఎలా స్వీకరిస్తారో కూడా చంద్రబాబు స్పష్టంచేయాలన్నారు. ఆయనెప్పుడూ రాజకీయాలలో తిరగడం కానీ, ఎవరి హృదయాన్నీ గాయపరచడం కానీ చేయని వ్యక్తి బ్రదర్ అనిల్ అని శ్రీకాంత్ పేర్కొన్నారు. రాజకీయాలలో వ్యక్తిగతంగా దిగజారి ఆరోపణలు చేయరాదని సూచిస్తున్నామని చెప్పారు.  ప్రజలన్నీ గమనిస్తున్నారని తెలిపారు. తాను చేసే అభివృద్ధి, ఇతరులు చేస్తే అవినీతి అనే విధానాన్ని బాబు అవలంబిస్తున్నారన్నారు. తాను కొన్నే చెప్పాననీ, ఇంకా ఎన్నో ఉన్నాయనీ చంద్రబాబు ఆలోచించుకోవాలని సూచించారు. బ్రదర్ అనిల్ కుమార్‌పై ఆరోపణలు చేస్తున్న ప్రతి ఒక్కరిపై పరువునష్టం దావా వేస్తామని శ్రీకాంత్ రెడ్డి  హెచ్చరించారు.

Back to Top