బొత్సపై పార్టీ నేతల మండిపాటు

పోలవరం 19 జూలై 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్పై నోరుపారేసుకున్న పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ అర్హత బొత్సకు లేదని పోలవరం ఎమ్మెల్యే, పశ్చిమగోదావరి జిల్లా పార్టీ కన్వీనర్ తెల్లం బాలరాజు విమర్శించారు. శ్రీమతి షర్మిల పాదయాత్రకు ఆయన సొంత జిల్లాలో వస్తున్న స్పందన చూసి బొత్స ఓర్వలేకపోతున్నారని, అందుకే మతి భ్రమించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని బాలరాజు మండిపడ్డారు. మహానేత డాక్టర్ వైయస్ఆర్ పెట్టిన భిక్ష వల్లే బొత్స కుటుంబం ఈరోజు రాజకీయంగా ఈ స్థితిలో ఉందన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మహానేత పట్ల ఉన్న అభిమానం శ్రీమతి షర్మిల పాదయాత్రలో బయటపడటంతో బొత్స కన్నుకుట్టి అసందర్భ ప్రేలాపనలు చేస్తున్నారని బాలరాజు మండిపడ్డారు.
'బొత్సను బఫూన్‌గా భావిస్తున్నారు'
విజయవాడ: డాక్టర్ వైయస్ఆర్‌పై బొత్స అనుచిత వ్యాఖ్యలపై జలీల్‌ఖాన్, ఉదయభాను మండిపడ్డారు. పేద ప్రజలను తాగిస్తూ నాశనం చేసిన ఘనత బొత్సదేనని జలీల్‌ఖాన్ అన్నారు. మద్యం, పేకాట లేకుండా పీసీసీ చీఫ్‌కు రోజు గడవదన్నారు. ఎంపీగా ఉండే పేకాట ఆడిన చరిత్ర బొత్సదని గుర్తు చేశారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే మనిషి బొత్స అని సామినేని ఉదయభాను విమర్శించారు. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న బొత్సను పిచ్చాసుపత్రికి పంపాలన్నారు. మహానేత చలవ లేకుంటే బొత్స సాధారణ కార్యకర్తగానే మిగిలేవారని తెలిపారు. విజయనగరం ప్రజలు బొత్సను బఫూన్‌గా భావిస్తున్నారని ఎద్దేవా చేశారు.

Back to Top