పల్లెల్లో పాలన పరారు

మహేశ్వరం:

ఏళ్ళు గడుస్తున్నా పంచాయతీలకు ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని దివంగత మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కారణంగా గ్రామాలకు సర్పంచులు లేకుండా పోయారనీ, ఫలితంగా పల్లెల్లో పాలన కనిపించడం లేదనీ చెప్పారు. పల్లె జనం కష్టాలనూ, కన్నీళ్ళనూ పట్టించుకునే నాధుడు కరవయ్యారన్నారు. గిరిజన తండాలనూ, మారుమూల పల్లెలలనూ కూడా పంచాయతీలుగా మార్చాలన్న మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి నిర్ణయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈ కారణంగా పంచాయతీలు నిర్వీర్యమవుతున్నాయని ఆమె చెప్పారు. మరోపక్క ఇలాంటి ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టకుండా ప్రతిపక్షనేత చంద్రబాబు నాటకాలాడుతున్నారని ఆరోపించారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 56వ రోజున ఆమె రంగారెడ్డి జిల్లాలో వివిధ ప్రాంతాలలో రచ్చబండ కార్యక్రమంలోనూ, ఇతర కార్యక్రమాలలోనూ ప్రసంగించారు. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే అన్ని  స్థానాలను తమ పార్టీ గెలుచుకుంటుందని సర్కారుకు భయం పట్టుకుందన్నారు. అందుకే ఇలా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

    సిరిగిరిపురంలో రచ్చబండ కార్యక్రమంలో పెంటమ్మ అనే వృద్ధురాలు పల్లె పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘పల్లె పడావు పడింది. ఓ పెసిడెంటు (సర్పంచు) లేడు.. ఎంపీటీసు (ఎంపీటీసీ) లేడు. ఊరు దిక్కు లేకుండా పోయింది. మడి తడుపుకుందామన్నా కరెంటు లేదు. చాపంత భూమికి కూడా నీళ్లు పారుతలే.. పెసిడెంటు దిగిపోయిన దినాంనుంచి సారోళ్లు (అధికారులు) ఊళ్లకు రాట్లేదు’’ అని ఆమె అనడంతో షర్మిల ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు.

     బుధవారం మొత్తం 18.90 కి.మీ మేర యాత్ర సాగింది. ఇప్పటివరకు మొత్తం 791.70 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. షర్మిల వెంట పాదయాత్రలో నడిచిన నేతల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, నేతలు రాజ్‌ఠాకూర్, జనక్ ప్రసాద్, జంగా కృష్ణమూర్తి, లక్ష్మీ పార్వతి, బెక్కరి జనార్దన్‌రెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి, దేప సురేఖ, వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురాం, శివకుమార్, ఆదం విజయ్‌కుమార్ తదితరులు ఉన్నారు.

తాజా ఫోటోలు

Back to Top