పాకినా, దేకినా బాబు సీఎం కాలేరు

హైదరాబాద్, 25 సెప్టెంబర్‌ 2012: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాదయాత్ర కాదు కదా పాకుడుయాత్ర చేసినా, చివరికి దేకుడు యాత్ర చేపట్టినా ముఖ్యమంత్రి కావడం కల్ల అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. చిత్తశుద్ధి లేని చంద్రబాబు 2004లో పోగొట్టుకున్న ముఖ్యమంత్రి పదవిని ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో సంపాదించుకోవాలని రకరకాల ఎత్తులు జిత్తులు వేస్తున్నారని విమర్శించారు. తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా, ఎనిమిదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా వెలగబెట్టినప్పుడు చంద్రబాబుకు ప్రజల సమస్యలు తెలియలేదా? అని సూటిగా ప్రశ్నించారు. మంగళవారం మధ్యాహ్నం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

అక్టోబర్‌ 2వ తేదీ నుంచి చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, అయితే, ఇంత హఠాత్తుగా మీరు ఇప్పుడు ఈ యాత్ర ఎందుకు చేయాలనుకుంటున్నారో అని రాష్ట్ర ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఆయన అన్నారు. చంద్రబాబు 'నే వస్తున్నా - మీ కోసం అనే పేరుతో పాదయాత్ర చేస్తారట. పోగొట్టుకున్న సీఎం పదవిని ఎలా రాబట్టుకోవాలన్న ఏకైక లక్ష్యంతో చంద్రబాబు అనేక విధాలుగా పరిశోధనలు చేస్తున్నారు. 2004 ఎన్నికల్లో వైయస్‌ రాజశేఖరరెడ్డి టిఆర్‌ఎస్‌, సిపిఐ, సిపిఎం పార్టీలతో పొత్తు పెట్టుకుని, గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. అందువల్లే వైయస్‌ సీఎం అయ్యారనుకుని 2009 ఎన్నికల నాటికి అదే పార్టీలతో "మహా కూటమి" పేరుతో విఫలయత్నం చేశారు. అయినా ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని తరిమికొట్టారు. మళ్ళీ వైయస్‌కే అధికారాన్ని అప్పగించిన విషయాన్ని మరిచిపోయారా' అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.

2003లో వైయస్‌ రాజశేఖరరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 1850 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల సాధక బాధకాలను అత్యంత సమీపంగా పరిశీలించి తెలుసుకున్నారు. ఆ పాదయాత్ర చేసిన తరువాత రాజశేఖరరెడ్డిలో ఎంతో మార్సే వచ్చిందని, ఆ యాత్రలో పాల్గొన్న వ్యక్తిగా తనకు ఆ విషయం స్పష్టంగా తెలుసని అంబటి తెలిపారు. అలా వైయస్‌ పాదయాత్ర చేసినందుకే ముఖ్యమంత్రి అయ్యారని భావించిన మీరు ఇప్పుడు అంత కంటే పెద్ద యాత్ర చేయాలనుకుంటున్నారు. చంద్రబాబు వ్యవహారం చూస్తే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఉందని అన్నారు. చివరికి మీకు వాతలే మిగులుతాయని ఎద్దేవా చేశారు. పాదయాత్ర చేసి అధికారంలోకి రావాలనుకుంటే చంద్రబాబుది అత్యాశే అవుతుందన్నారు. అధికారం కోసం వైయస్‌ పాదయాత్ర చేయలేదన్న విషయాన్ని చంద్రబాబు తెలుసుకోవాలని అంబటి అన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజలను అర్థం చేసుకోవడానికి, తనను తాను మార్చుకోవడానికే ఆయన రాష్ట్రం ఈ చివరి నుంచి ఆ చివరికి పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. ప్రజలకు ఏదో మేలు చేయాలన్న ఉద్దేశంలో బాబు పాదయాత్ర నిర్ణయంలో కనిపించడంలేదని, ఇంతకాలంగా సీఎం కాలేకపోయానన్న నిస్పృహతోనే ఆయన ఈ యాత్ర చేస్తున్నట్లు ఉందని అన్నారు.

గతంలో చంద్రబాబు చేసిన పాలన కంటే నికృష్టంగా ఇప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలన తయారైందని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఇంతకు ముందటి తన పరిపాలన కన్నా మెరుగైన పాలన అందిస్తానని ప్రజలకు చెప్పేందుకు చంద్రబాబు ఈ పాదయాత్ర తలపెట్టలేదట అని అంబటి అన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజలను చైతన్యం చేస్తానని బాబు చెబుతున్నారని, అయితే, ఇప్పుడు మీరు ప్రజలను చైతన్యం చేసేదేమిటి? 2004 నాటికే ప్రజలు చైతన్యం అయ్యారని, అందుకే 2004లోను 2009లోను వైయస్‌ రాజశేఖరరెడ్డికి అధికారాన్ని కట్టబెట్టారని అన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వ (రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి) హయాంలో ఇప్పటికి మూడుసార్లు విద్యుత్‌ చార్జీలు పెంచిందని, చంద్రబాబు పాలనలో వాటిని ఏడెనిమిది సార్లు పెంచారని అంబటి గుర్తుచేశారు. ఆర్టీసీ చార్జీలనూ చంద్రబాబు పెంచేశారని చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్రం ఎరువుల ధరలను విపరీతంగా పెంచేసిందని, అయినా ఆయన అడ్డుకునే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. గ్యాస్‌ ధరలూ నూరు శాతం పెంచారన్నారు. చంద్రబాబు ఏలుబడిలో మన రాష్ట్ర ప్రజలు ఎంతటి దౌర్భాగ్య పరిస్థితిని అనుభవించారో అలాంటి ఇబ్బందులనే కిరణ్‌ ప్రభుత్వంలోనూ చవిచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

2004 ఎన్నికలకు ముందు వైయస్‌ రాజశేఖరరెడ్డి ఈ రాష్ట్ర ప్రజలకు అనేక విషయాలు చెప్పారన్నారు. వాటిలో రైతులకు ఉచిత విద్యుత్‌ ఒకటన్నారు. ఆయన ఉచిత విద్యుత్ ఇస్తామని చెబితే చంద్రబాబు 'విద్యుత్‌ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని' దారుణంగా వ్యాఖ్యానించిన విషయాన్ని ఎత్తి చూపారు. వైయస్‌ పరిపాలించిన ఐదేళ్ళ మూడు నెలల కాలంలో వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేయలేదా అని నిలదీశారు.

గావంచా కట్టివాడల్లా గాంధీ అవుతాడా?:
గావంచా కట్టినవాడల్లా గాంధీ కానట్లే పాదయాత్ర చేసినవాడూ ముఖ్యమంత్రి కాలేడని అంబటి ఎద్దేవా చేశారు.  మీ కోసం వస్తున్నా అంటూ ప్రజలను ఏమార్చేందుకే పాటలు ఎలా ఉండాలి, తలపాగా ఎలా కట్టుకోవాలి అనే విషయాల్లో సినిమా దర్శకులు, రచయితల సలహాలు తీనుకుంటున్నారని ఆరోపించారు. పాదయాత్రను చంద్రబాబు ఓ చలనచిత్రంలా మారుస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నక్కజిత్తులను ఈ రాష్ట్ర ప్రజలు గమనించడంలేదని అనుకోవద్దని అంబటి హెచ్చరించారు.

టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి 44శాతం ఓట్లతో అధికారం చెలాయిస్తున్న ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్న చరిత్ర చంద్రబాబుది అని అంబటి దుయ్యబట్టారు. ఆ ఓట్ల శాతాన్ని 2004 ఎన్నికల నాటికి 28 శాతానికి దిగజార్చినదీ చంద్రబాబే అన్నారు. టిడిపి గ్రాఫ్‌ రోజురోజుకూ దిగజారిపోవడానికి చంద్రబాబే కారకుడని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత 42 సార్లు ఉప ఎన్నికలు జరిగాయని, వాటిలో ఒక్క సీటు కూడా గెలవలేక, అనేక చోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయి చతికిల పడిన టిడిపి వైనాన్ని ఈ సందర్భంగా అంబటి గుర్తుచేశారు.

అనంతరం చంద్రబాబు పాదయాత్ర చేస్తే మీకేమి అభ్యంతరం అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు అంబటి సమాధానం ఇస్తూ, అబద్ధాలతో మరో మారు ప్రజలను ఏమార్చేందుకు వస్తున్న చంద్రబాబును నిలదీసే హక్కు ఒక రాజకీయ పార్టీగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి లేదా అని అంబటి నిలదీశారు. చంద్రబాబు బండారం బయటపెట్టే సాధనాలు ఇంకా ఉపయోగించలేదని అన్నారు. త్వరలోనే బాబు దొంగతనం అంతా బట్టబయలు అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన కిలో 2 రూపాయల బియ్యం పథకాన్ని తుంగలో తొక్కిన చంద్రబాబును ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించబోరని హెచ్చరించారు. ప్రజల అనుమానాలకు ముందుగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉందని అంబటి డిమాండ్‌ చేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధిగా తమ పార్టీ తరఫున తాను కూడా ప్రజల అనుమానాలపై జవాబు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నానని అంబటి అన్నారు.
Back to Top