ఒకే ప్రభుత్వం..వంద దోపిడీలు

  • చంద్రబాబు స్మగ్లర్ల ముఖ్యమంత్రి
  • ఎర్రదొంగలకు బాసటగా టీడీపీ నాయకులు
  • రోజుకు రూ. 100కోట్లు కొల్లగొడుతున్నారు
  • 40లక్షల కోట్ల విలువ చేసే సంపదను లూటీ చేస్తున్నారు
  • రోజుకు 5వేల మంది అడవికి వెళుతున్నారు
  • ఎర్రదోపిడీ కోసం టాస్క్ ఫోర్స్ ను నిర్వీర్యం చేసిన బాబు సర్కార్
  • వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి  భూమన కరుణాకర్ రెడ్డి
హైదరాబాద్ః తెలుగుదేశం ప్రభుత్వం స్మగ్లర్లకు బాసటగా నిలుస్తూ  శేషాచల కొండల్లోని ఎర్రచందనం సంపదనంతా కొల్లగొడుతోందని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. వేలూరు, జావాది హిల్స్ లో తిరువన్నావలైకి సంబంధించిన వాళ్లతో తెలుగుదేశం నాయకులే ఎర్రవ్యాపారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను అధికారంలోకి వచ్చాక ఎర్రచందనం దొంగలను ఏరేస్తా, ఎర్రసంపదను కాపాడుతానని బీరాలు పలికిన చంద్రబాబు...ఉద్దేశ్యపూర్వకంగా పనిగట్టుకొని ఎర్రసంపదను దోచేస్తున్నారని ధ్వజమెత్తారు.  కేంద్రంతో మాట్లాడి పోర్టులన్నంటి దగ్గర దుంగలను ఇతర దేశాలకు తరలిస్తున్నారని విమర్శించారు. రాందేవ్ బాబా సీ గ్రేడ్ ఎర్రచందనం దుంగలను ఓ టన్ను 28 లక్షల 40 వేలకు కొన్నాడని ఆరోపించారు. అదే ఏ గ్రేడ్ ఐతే రూ.కోటి పలుకుతుందన్నారు. నిన్న ఏ గ్రేడ్ 1100 టన్నులు విక్రయం చేస్తే 92వేలకు మాత్రమే కోడ్ చేయడం వెనుక రహస్యమేంటో చెప్పాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. ఎర్రచందనం స్మగ్లర్లు దానికి కాపు కాస్తున్న పెదకాపు ప్రభుత్వం అంతా ఒక్కటై ప్రకృతి సంపదను దోచిపారేస్తున్నారని నిప్పులు చెరిగారు.  హైదరాబాద్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో భూమన కరుణాకర్ రెడ్డి టీడీపీ సర్కార్ దోపిడీని ఎండగట్టారు. 

అధికారంలోకి వచ్చిన వెంటనే దొరికిన ఎర్రచందనాన్ని వేల వేయడం ద్వారా ఆ నిధుల సమీకరణతో రైతులకు లక్షన్నర, డ్వాక్రాసంఘానికి లక్ష రూపాయలు చేకూరుస్తానని చెప్పిన బాబు మాటలు ఏమయ్యాయని భూమన కరుణాక్ రెడ్డి ప్రశ్నించారు.  రెండున్నరేళ్లలో 800 కోట్లు మాత్రమే ఎందుకు సమీకరణ అయినాయని నిలదీశారు. రాష్ట్రంలో 10వేల 500 టన్నుల నిల్వలున్నాయని చెప్పిన వ్యక్తి ఇప్పటివరకు 2వేల టన్నులు కూడా ఎందుకు వేలం వేయలేదని, స్మగ్లర్లను అణచివేసేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నానని ప్రకటించిన బాబు అందుకు తగ్గట్టుగా సిబ్బందిని ఎందుకు నియమించడం లేదని కడిగేశారు. కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 11లక్షల ఎకరాల్లో 40లక్షల కోట్ల విలువ చేసే ఎర్రచందనం నిధి ఉందని అన్నారు. పొడిచేస్తా, అణిచివేస్తా, ఓఎర్రచందనం దొంగను పట్టేశానని బీరాలు పలకడం తప్ప బాబు చేసిందేమీ లేదని అన్నారు. 150మందికి తుప్పు పట్టిన తుపాకీలు ఇచ్చి అడవుల్లోకి వెళ్లే అధికారం లేకుండా చేసి బాబును టాస్క్ ఫోర్స్ ను నిర్వీర్యమైన సంస్థగా మార్చారని దుయ్యబట్టారు. అది కూడా ప్రజలకు చెప్పడానికి మాత్రమే ఉపయోగించి దాని వెనుక పెద్ద కుట్ర చేశాడని అన్నారు.  బాబు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాక ఓ డీఐజీ స్థాయి అధికారిని మాత్రమే నియమించారని,  రెండేళ్లు దాటినా దాంట్లో ఏసీఎఫ్ పోస్టులను ఇంతవరకు నింపలేదన్నారు. రోజుకు 5వేల మంది కూలీలు అడవుల్లోకి వెళుతూ రెండున్నరేళ్లుగా నూరుకోట్ల విలువైన సంపదను కొల్లగొడుతున్నారని భూమన తెలిపారు. అడవికి బాటలు పర్చి బాబు కోటలు కడుతున్నారని భూమన ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లక్ష కోట్లకు పైగా దుంగల్ని టీడీపీ ప్రబుత్వమే బయటకు పంపిందని బట్టబయలు చేశారు. ఏమీ ఏరుగనట్టు నారావారిపల్లెలోనే ఎర్రచందనం అక్రమనిల్వలున్నాయి. నాకు చెడ్డపేరు తెస్తారా అని బాబు సుద్దులు చెబుతాడని భూమన విరుచుకుపడ్డారు. 

సిబ్బంది లేకుండా టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసిన ఘనుడు బాబు అని భూమన ఫైర్ అయ్యారు. డీఐజీ, డీఎఫ్ఓ తప్ప ఏసీఎఫ్ అధికారులను నియమిచిన పాపాన పోలేదన్నారు. కడప జిల్లాకు ఓ డీఎఫ్ఓని కూడా నియమించలేదని, 300మంది సిబ్బందిని ప్రకటిస్తే అందులో 150 కూడా నియమించడం లేదని ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. రాష్ట్ర బడ్జెట్ సంవత్సరానికి లక్ష, లక్షన్నర కోట్లు పెడతారని, అలాంటిది గ్రేహౌండ్స్, ఆక్టోపస్ తరహాలో చేయవల్సిన దాడుల్ని చేయకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు.  40 లక్షల కోట్ల విలువ చేసే సంపదను రోజుకు 100 కోట్ల చొప్పున తరలిస్తుంటే ప్రభుత్వానికి బాధ్యత లేదా..? చేష్టలూడిగి కూర్చున్నారా..? టీడీపీ వాళ్లను కోట్లకు కోట్లు సంపాదించాలని అడవి తల్లిని వనరుగా మార్చారా ..?బాబు సమాధానం చెప్పాలన్నారు.  ఓ యాక్ట్ తీసుకొచ్చి చట్టాన్ని సవరించే ప్రయత్నం కూడా చేయలేదన్నారు. ప్రత్యేక కలప అన్న మాట చేరుస్తే ఒక్క దుంగ కూడా బయటకు తరలివెళ్లదన్నారు. బాబు మాటలుతో కోటలు దాటిస్తున్నాడని భూమన ఆగ్రహించారు. కోటాను కోట్లు తరలిపోతున్నా పట్టించుకోని స్మగ్లర్ల ముఖ్యమంత్రి చంద్రబాబు అని భూమన నిప్పులు చెరిగారు. ఒకే ప్రభుత్వం వంద దోపిడీలు చేసే ప్రభుత్వమని దుయ్యబట్టారు. పోలీస్ ఫోర్స్ ను పెంచి అటవీ అధికారులకు మరింత అధికారం ఇచ్చి ఉంటే ఇలా జరుగుతుందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  130 కోట్ల బారతీయులను 50 రోజులుగా పెట్టిన శ్రమ వల్ల 3,4 లక్షల కోట్ల నల్లధనం మిగులుతుందని చెప్పిన ప్రధాని మోడీకి... స్మగ్లర్లకు సహకరిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం 40లక్షల కోట్ల విలువ చేసే దుంగల్ని ఇతరదేశాలకు తెగనమ్ముతుంటే కనబడడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీ, మట్టిదోపిడీ, ధాన్యం దోపిడీ, అసైన్డ్ భూముల దోపిడీ, కాల్ మనీ దోపిడీ, దేవాలయ భూముల దోపిడీ, ఎర్రచందనం దోపిడీ...అంతా దోపిడీ పాలన సాగుంతన్నారు. దోచుకోవడానికి దాచుకోవడానికే చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చినట్టుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా స్మగ్లర్లను అణచివేసేందుకు చిత్తశుద్ధిని చాటుకోవాలని, నారాచంద్రనో, ఎర్రచంద్రనో నిరూపించుకోవాలని హితవు పలికారు. . 
Back to Top