స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి8మందిని అనర్హులుగా ప్రకటించాలిఅప్పుడే ప్రజాస్వామ్య విలువలు కాపాడినట్లుస్పీకర్ నిర్ణయం బాబుకు చెంపపెట్టు కావాలిః జ్యోతుల నెహ్రూ
హైదరాబాద్ః వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కమిటీ హాలులో స్పీకర్ ను కలిశారు. పార్టీ ఫిరాయించిన 8మంది ఎమ్మెల్యేలపై తక్షణమే అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరినట్లు పార్టీ శాసనసభా పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ఈసందర్భంగా తెలిపారు. వైఎస్సార్సీపీ గుర్తుపై నెగ్గి , పార్టీకి ద్రోహం చేసి అనైతిక విధానంతో ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరడం దుర్మార్గమన్నారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన 10 వ షెడ్యూల్ లో భాగంగా ...యాంటీ డిఫెక్షన్ బిల్లును అనుసరించి తగు చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు నోటీసులు ఇచ్చామన్నారు. నిబంధనల మేరకు తగు నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ చెప్పారని జ్యోతుల పేర్కొన్నారు.
కూలంకుషంగా పరిశీలన చేసి నిష్పక్షపాతంగా ఫిరాయింపుదారులను అనర్హులుగా ప్రకటించాలని ఎమ్మెల్యేలు స్పీకర్ ను డిమాండ్ చేశారు. అప్పుడే ప్రజల మనోభావాలు వ్యక్తమవుతాయని, ఎన్నికలు వస్తే ప్రజలు ఏరంకగా ఆలోచన చేస్తున్నారన్న వాస్తవాలు బయటకు వస్తాయని జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు . అన్ని ఆధారాలతో కూడిన నోటీసును స్పీకర్ కు నివేదించామన్నారు. వైఎస్సార్సీపీకి న్యాయం చేస్తారని ఆశిస్తున్నామన్నారు. . ఇక అసెంబ్లీలో ముందుగా ప్రభుత్వం మీద అవిశ్వాసం ప్రవేశపెడుతామన్నారు. స్పీకర్ మీద పెట్టాలా వద్దా అన్నది పరిశీలన చేస్తామన్నారు. నోటీసును అనుసరించి స్పీకర్ న్యాయబద్ధంగా వ్యవహరిస్తే అవిశ్వాసం పెట్టకపోవచ్చన్నారు.
టీడీపీలోకి వెళ్లిన శాసనసభ్యులందరినీ అనర్హులుగా ప్రకటించాలని నొక్కి వక్కానించామని జ్యోతుల ప్రకటించారు. నీతివంత రాజకీయాలు చేస్తానని తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకునే బాబుకు...ఈచర్యతో కనువిప్పు కలుగుతుందని తాము భావిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడాలన్న ఆలోచనతో తగు నిర్ణయం తీసుకుంటే... ఈ దుశ్చర్య చంద్రబాబుకు చెంపపెట్టు అవుతుందన్నారు.