నిర్వాసితులకు అండగా నిలుస్తాం: శ్రీమతి షర్మిల

నర్సందొడ్డి:

మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో దివంగత మహానేత తనయ శ్రీమతి వైయస్ షర్మిల ఉప్పేరు, నెట్టెంపాడు, వామనపల్లి, నర్సందొడ్డి గ్రామాల్లో షర్మిల యాత్ర చేసినప్పుడు.. స్థానికులు ఆమెను కలిసి బాధలు  చెప్పుకున్నారు. ‘నెట్టెంపాడు ప్రాజెక్టుతో తమ గ్రామాలు మునిగిపోతున్నాయనీ, ట్రయల్ రన్ కోసం నీళ్లు వదలటంతోనే ఇళ్లలోకి చెమ్మ చేరిందనీ చెప్పారు.  నీళ్లు పూర్తిగా వదిలితే ఇళ్లలో నీళ్లు ఊరుతాయన్నారు. ఇప్పటికే పంట భూములు పోగొట్టుకున్నామని వారంతా ఆందోళన వ్యక్తంచేశారు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘మీ బాధ నాకు అర్థమయిందన్నారు. ప్రాజెక్టులు కట్టడం ఎంత ముఖ్యమో నిర్వాసితులకు అండగా నిలబడటం కూడా అంతే ముఖ్యమన్నారు. కచ్చితంగా మీకు నష్టపరిహారం చెల్లించి మళ్లీ మీకు పునరావాసం కల్పించాలనడంలో ఎలాటీ ఆలోచనా లేదు.. రాజీపడేదీ లేదన్నారు. అందుకోసం తమ పార్టీ పోరాడుతుందన్నారు. మానవత్వం లేని ఈ పాలకులు పట్టించుకొని మన సమస్యను తీరుస్తారనే నమ్మకం తనకు లేదన్నారు. జగనన్న రాగానే మీకు సంతోషం కలిగించేలా నష్టపరిహారం చెల్లించి పునరావాసం కల్పిస్తారని వారికి భరోసా ఇచ్చారు.

కన్నీరు మున్నీరయిన శ్రీమతి షర్మిల..


    బుధవారం రాత్రి నెట్టెంపాడు ప్రాజెక్టు వద్దే బస చేసిన షర్మిల గురువారం ఉదయం ప్రాజెక్టును పరిశీలించారు. మోటారు పంపు సెట్ల పని తీరును పరిశీలించేందుకు ఆరు అంతస్తులు ఉన్న టన్నెల్‌లోకి దిగి చూసి.. తర్వాత కాల్వ వద్దకు చేరుకున్నారు. కాల్వలో పారుతున్న నీళ్లను చూడగానే ఆమె ఉద్వేగానికి లోనయ్యారు. అక్కడే ఏర్పాటు చేసిన వైయస్ఆర్ విగ్రహానికి ప్రార్థన చేస్తూ.. కన్నీరు పెట్టుకున్నారు. పక్కనే ఉన్న రైతులు, స్థానిక ప్రజలు కూడా ఉద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. ‘బాధపడొద్దమ్మా.. పారే నీళ్లలో నాన్నను చూసుకుంటాం.. ఈ ప్రాజెక్టు ఉన్నంత కాలం నాన్న మా గుండెలో..మా ప్రాంత ప్రజల గుండెల్లో ఉంటారు’ అని స్థానిక నాయకులు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు.

Back to Top