పత్తికొండ: చిత్రంలో మహానేత తనయవైపు ఆసక్తిగా చూస్తున్న చిన్నారిని గమనించారా. ఆమెలో ఓ విశేషముంది. అదేమిటంటే అందరికీ ఎడమ వైపున ఉండే గుండె ఈ పాపకు కుడివైపున ఉండడం. పేరు సాయిలక్ష్మి.. వయసు పది సంవత్సరాలు. ఆ చిన్నారి గుండెకు రంధ్రం కూడా పడింది. తరచూ అనారోగ్యానికి గురవుతున్న ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్ళగా అసలు విషయం వెల్లడైంది. చికిత్సకు రూ. 5.75 లక్షలు ఖర్చవుతుందనీ, అదీ రెండుసార్లుగా శస్త్రచికిత్స చేయాలనీ వైద్యులు తేల్చారు. మహానేత ఉండగా ఆరోగ్యశ్రీ కింద అవసరమైన మొత్తాన్ని మంజూరు చేశారు. తొలి విడత చికిత్స పూర్తయ్యింది. మూడేళ్ళు గడిచినప్పటికీ రెండోసారి చేయాల్సిన చికిత్సకు వీలుకావడంలేదు. కారణం అందుకు అవసరమైన మొత్తం విడుదల కాకపోవడమే. మద్దికెర నుంచి పాదయాత్ర చేసుకుంటూ వెడుతున్న వైయస్ షర్మిల శుక్రవారం ఎం.అగ్రహారం గ్రామానికి చేరుకున్నపుడు అక్కడే ఈ విషయం బయటపడింది. సాయిలక్ష్మి తల్లిదండ్రులు పరిస్థితిని ఆమెకు వివరించారు. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు సాయిలక్ష్మికి శస్త్ర చికిత్స చేయించారని తల్లిదండ్రులు షర్మి దృష్టికి తీసుకువచ్చారు. రెండో విడత చికిత్స చేయాల్సి ఉందనీ, ప్రభుత్వం నిధులిచ్చి సహకరించడంలేదని వారామెతో వాపోయారు.