శాంతినగర్, (మహబూబ్‌నగర్ జిల్లా), 24 నవంబర్ 2012: దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నప్పుడు రైతును రాజు చేశారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పేర్కొన్నారు. ఇళ్ళు లేని నిరుపేదలకు గూడు కల్పించేందుకు 45 లక్షల ఇళ్ళు కట్టించి ఇచ్చిన ఘనత వైయస్‌ది అని ఆమె గుర్తు చేశారు. ఒకే రాష్ట్రంలో ఇంత భారీ స్థాయిలో ఇళ్ళు కట్టించిన ముఖ్యమంత్రి మన దేశంలో మరోకరు లేరన్నారు. వైయస్ జగన్మోహన్‌రెడ్డి తరఫున మరో ప్రజాప్రస్థానం 38వ రోజు పాదయాత్ర చేస్తున్న షర్మిల శనివారం ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం పరిధిలోని బూడిదపాడు క్రాస్ నుంచి ప్రారంభమైంది అక్కడి నుంచి ఆమె శాంతినగర్ చేరుకుని అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కాగా శనివారంనాడు షర్మిల పాదయాత్ర మహబూబ్‌నగర్ జిల్లాలో మూడవ రోజు కొనసాగిస్తున్నారు.
ఈ సందర్భంగా వరదల కారణంగా సర్వస్వం కోల్పోయి ఇప్పటికి ఇంకా గుడారాల్లో తలదాచుకుంటున్న పలువురు షర్మిల ముందు తాము పడుతున్న అవస్థలు వినిపించి విలపించారు. ఇన్ని అవస్థలు పడుతున్నా తమను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బతుకులు ఎలా ఛిద్రమైపోయాయో చూడమని షర్మిల ముందు బాధితులంతా భోరున విలపించారు. దీనిపై స్పందించిన షర్మిల కొద్ది రోజులు ఓపిక పట్టమని, జగనన్న త్వరలోనే బయటికి వస్తారని, మీ కష్టాలు గట్టెక్కిస్తాడని భరోసా ఇచ్చారు.
రాష్ట్ర రాజధానీ నగరంలోని లక్షల కోట్ల విలువైన భూములను ఐఎంజీ సంస్థకు చంద్రబాబునాయుడు అప్పనంగా కట్టబెట్టారని షర్మిల నిప్పులు చెరిగారు. ఒక్కో ఎకరం రెండు కోట్ల రూపాయల విలువైన 850 ఎకరాలను ఆయన ఐఎంజికి ఒక్కో ఎకరా కేవలం రూ. 50 వేలకే అప్పనంగా కట్టబెట్టేశారని నిప్పులు చెరిగారు. ఐఎంజీ సంస్థ చంద్రబాబు బినామీ సంస్థ కాదా అని ఆమె నిలదీశారు. ఐఎంజి భూముల వ్యవహారంలో చంద్రబాబును ఏ దర్యాప్తు సంస్థా ఎప్పుడూ ఎందుకు విచారణ చేయలేదని నిలదీశారు. చీకటి ఒప్పందం కారణంగానే ఈ అసమర్థ ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాసం పెట్టడంలేదని ఆరోపించారు.
ఆర్డీఎస్ రైతులు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయినా ఈ ప్రభుత్వంలో ఎందుకు చలనం లేదని దుయ్యబట్టారు. ధనికులతో సమానంగా నిరుపేదలకు కూడా పూర్తి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలన్న సదుద్దేశంతో డాక్టర్ వైయస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని నిందించారు. లక్షల కోట్ల విలువైన కేజీ బేసిన్ సహజవనరులను రిలయన్స్ సంస్థకు చంద్రబాబు కట్టబెట్టారని ఆరోపించారు. 2జీ, కోల్ కుంభకోణాల కన్నా కేజి బేసిన్ స్కాం పెద్దదని అన్నారు. కేజీ బేసిన్ గ్యాస్‌పై సరైన ఒప్పందం చేసుకుని ఉంటే తద్వారా మన రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ పైప్‌లైన్ గ్యాస్ సరఫరా చేయడానికి వీలుండేదని షర్మిల అన్నారు.
దేశానికి అన్నం పెట్టే అన్నదాత నేడు తన దుస్థితి నుంచి ఎలా బయటపడాలో దిక్కుతోచక కన్నీళ్ళు పెడుతున్నాడని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో విద్యత్ సంక్షోభం పెరిగిపోయిందన్నారు. త్వరలోనే జగనన్న బయటకు వస్తాడనీ, రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తాడనీ ఆమె చెప్పారు.
ఈ అసమర్థ ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాసం ఎందుకు పెట్టడంలేదని షర్మిల సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని ఆమె మండిపడ్డారు. నీచ రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్, టిడిపిలపై ఆమె నిప్పులు చెరిగారు. ఆ రెండు పార్టీలూ సిబిఐని వాడుకుని జగనన్నను జైల్లో పెట్టించాయన్నారు. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్, టిడిపిలకు గుణపాఠం చెప్పాలని ప్రజలకు షర్మిల పిలుపునిచ్చారు.