ఎన్డీయే వైఖరి ప్రజాస్వామ్యానికి మచ్చ

చర్చ జరిగేదాకా అవిశ్వాసం ఇస్తూనే ఉంటాం
వైయస్‌ జగన్‌ ఆదేశాలతో రాజీనామాలకు సిద్ధం
ప్రజల్లోకి వెళ్లి ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
వైయస్‌ఆర్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి

ఢిల్లీ: ఎన్ని రోజులు పార్లమెంట్‌ జరుగుతుందో అన్ని రోజులు అవిశ్వాసం ప్రవేశపెడుతూనే ఉంటామని వైయస్‌ఆర్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. అవిశ్వాస తీర్మానంపై ఆశలు సన్నగిల్లుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం చర్చకు రానివ్వకుండా దాటవేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్‌సభ వాయిదా అనంతరం మేకపాటి రాజమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్డీయే ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి.. ఆడిన మాట తప్పి ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చిందన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు 14వ ఆర్థిక సంఘం అభ్యంతరం చెప్పలేదని, కానీ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కుంటిసాకులు చూపుతున్నాయని ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి మీటింగ్‌లో చెబుతున్నారన్నారు. హోదా సాధించాల్సిన చంద్రబాబు ఎన్డీయేలో భాగస్వామిగా ఉండి నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అన్ని పార్టీలు ముందుకు వచ్చి వైయస్‌ఆర్‌ సీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. 
ప్రత్యేక హోదాపై లోక్‌సభలో చర్చ జరిగి.. కేంద్రం హోదా ఇవ్వని నేపథ్యంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలమంతా స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తామని మేకపాటి స్పష్టం చేశారు. వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజల్లోకి వెళ్లి హోదా ఉద్యమాన్ని బలపర్చి ఎన్నికలకు వెళ్తామన్నారు. సమావేశంలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, వైయస్‌ అవినాష్‌రెడ్డి, వరప్రసాద్‌ తదితరులు ఉన్నారు
Back to Top