బాబు ముందుకు! పార్టీ వెనక్కు...!!

జనం మన దగ్గరికి రాకపోతే... మనమే వారి దగ్గరికి వెడదాం...
ఈ మాట ఎక్కడో విన్నట్టుందా..  
తాను తలపెట్టిన పాదయాత్ర గురించి ఎవరెన్ని వ్యాఖ్యానాలు చేసుకుంటున్న.. చంద్రబాబు యధాప్రకారం చెక్కుచెదరటం లేదు. 'నవ్విపోదురు గాక.. నాకేటి..' అనే చందాన ఆయన తన పని తాను చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఆయన ఎప్పుడు అనే 'ఆ విధంగా ముందుకు పోతున్నాం' అనే వ్యాఖ్యనే నమూనాగా తీసుకుంటున్నారు. 

ఎట్టకేలకూ పాదయాత్ర ప్రారంభ స్థలం ఖరారైంది. ఆయన చెబుతున్న ప్రకారం 2300 కి.మీ. సాగే ఈ యాత్రను తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారు కాగ్రెస్ పార్టీ నాయకులు. అడుగడుగునా అడ్డంకులు సృష్టించి బాబును చికాకు పెట్టాలనీ, యాత్ర కొనసాగిద్దామా లేక ముగించేద్దామా అనే స్థితిని ఆయనకు కల్పించాలని వారు ఉవ్విళ్ళూరుతున్నారు.  ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ఆయన పాద యాత్రను టార్గెట్ చేసుకుంది. 

చంద్రబాబు యాత్ర ఆయన పార్టీలో ఉల్లాసాన్ని నింపుతుండగా. ఇది పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందాన ఉందని పలువురు నోళ్ళు నొక్కుకుంటున్నారు. 2003లో మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తలపెట్టిన ప్రజాప్రస్థానమే ఆయనకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిందని నమ్మి బాబు ఇప్పడు అదే తరహా కార్యక్రమం తలపెట్టారనేది వారి భావన.  ఎమ్మెల్యేలను గిల్లి తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఎన్టీఆర్ అల్లుడు మళ్ళీ ఆ పీఠాన్ని అధివసించాలని తహతహలాడుతున్నారు. చివరి అస్త్రంగా ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నారు.

తెలంగాణ ప్రాంతంలో ప్రారంభమయ్యే ఈ యాత్రలో కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ వాదులు అడుగడుగున అడ్డంపడి తెలంగాణపై వైఖరిని ప్రకటించాలని నిలదీసేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.  తన నడక ప్రశాంతంగా సాగాలనుకుంటే ఏదో ఒకటి చెప్పక తప్పదు. తెలంగాణ ప్రాంతంగుండా వెడుతున్నారు కాబట్టి, అక్కడికి అనుగుణంగానే ఆయన మాట్లాడతారు. అదే జరిగితే బాబు సీమాంధ్ర ప్రాంతంలో అడుగుపెడితే అక్కడి వారు ఊరుకోరు కదా. అక్కడి తెలుగు దేశం నేతలే పార్టీకి వ్యతిరేకంగా మారిపోతారు. 

తెలంగాణపై లేఖ ఇచ్చేద్దామని ఇటీవల కొన్నాళ్ళు ఊగి వెనక్కి తగ్గిన చంద్రబాబు తాను జనంలో గడిపే 117 రోజులూ తెలంగాణపై ఏమీ చెప్పకుండా నెట్టుకు రావడం కష్టతరమైన పని.  కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని చెప్పమని కోరకముందే బాబు ఆ పార్టీని ఇదే అంశంపై డిమాండ్ చేస్తే కొంత ప్రయోజనం ఉండేది. కానీ, ఆయన తమ పార్టీ తెలంగాణకు అనుకూలమని ప్రకటించేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. సీమాంధ్రకు చెందిన సహచర శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు ఆయనకు బ్రేకులు వేస్తున్నారు.


Back to Top