ముఖ్యమంత్రి ఇంటికి ఎన్ని సిలిండర్లు వెడుతున్నాయో!

పెద్ద కడుబూరు(మంత్రాలయం):

జైల్లో ఖైదీలకు కూడా భోజన ఖర్చుకు రోజుకు రూ. 45 కేటాయిస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల చెప్పారు. హాస్టల్ విద్యార్థులకు రెండు పూటల భోజనానికి పదిహేడు రూపాయలు మాత్రమే ఇవ్వడం దారుణమన్నారు. ఈ చిన్న మొత్తంతో అదెలా సాధ్యమని ప్రశ్నించారు. షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ గురువారం 29వ రోజు యాత్ర ముగిసేనాటికి 376 కిలోమీటర్లు పూర్తిచేశారు. మంత్రాలయం నియోజకవర్గంలోని పెద్ద కడుబూరు సమీపంలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో ఆమె విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.  
    


     హాస్టల్లో నెలకు 18 చొప్పున ఏడాదికి 216 సిలిండర్లు దాకా వాడాల్సిన అవసరముంటే.. వాటిలో ఆరు మాత్రమే ప్రభుత్వం సబ్సిడీ మీద ఇస్తోందనీ, మిగిలినవి రూ.1,250 పెట్టి కొనుక్కోవాలనీ షర్మిల ధ్వజమెత్తారు.  గ్యాస్ మీద భారం మోపి ఈ ప్రభుత్వం పిల్లల కడుపుమీద కొడుతోంది. ఇది అన్యాయం కాదా? అని ఆమె ప్రశ్నించారు. అసలు కిరణ్‌కుమార్‌రెడ్డి ఇంటికి ఎన్ని సిలిండర్లు వెళుతున్నాయో కనుక్కోవాలంటూ మండిపడ్డారు.


     హాస్టల్లో కరెంటు ఉండడం లేదని, ప్రహారీ, ఆట స్థలం లేవనీ విద్యార్థినులు ఆమెకు ఫిర్యాదు చేశారు. గ్యాస్ ధర పెరిగిందంటూ మెనూలో కోతపెడుతున్నారంటూ ఆరోపించారు. దీనికి స్పందించిన షర్మిల గ్యాస్ పేరుతో పిల్లల పొట్ట మీద కొట్టడం అమానవీయమని అన్నారు. పాలు, గుడ్లు, అల్పాహారం అందుతున్నాయా? అని అడగడంతో పాలు ఇవ్వరని, గుడ్లు వారానికి మూడు ఇస్తారని విద్యార్థినులు తెలిపారు. పదో తరగతితో ఆపకుండా పెద్ద చదువులు చదవాలని, జగనన్న సీఎం అయ్యాక ఎంత పెద్ద చదువైనా ఉచితంగా చదివిస్తాడని షర్మిల వారికి భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కలెక్టర్‌తో మాట్లాడి క్రీడామైదానం వచ్చేలా చూస్తారని షర్మిల హామీ ఇచ్చారు.

     జనం జనం.. ప్రభంజనం: గురువారం ఉదయం రంగాపురం శివారులో బయలుదేరిన షర్మిలకు మంత్రాలయం నియోజకవర్గ ప్రజానీకం అడుగడుగునా బ్రహ్మరథం పట్టింది. మధ్యాహ్నం పెద్దకడబూరు చేరేవరకు వేలాది మంది జనం షర్మిలతోపాటు కాలు కలిపి కదం తొక్కారు. యాత్ర సాగిన దారంతా మట్టిరోడ్డు కావడం, షర్మిల వెంట వేలాది మంది కదలి రావడంతో రోడ్డంతా తీవ్రమైన దుమ్ము, ధూళి రేగింది. మధ్యాహ్నం జరిగిన బహిరంగ సభ జనంతో కిక్కిరిసిపోయింది. తరువాత దొడ్డిమేకల మీదుగా రాత్రి హెచ్.మోరవాణి సమీపంలో ఏర్పాటుచేసిన రాత్రి బసకు 7.50కి షర్మిల చేరుకున్నారు. గురువారం 14.6 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. ఇప్పటివరకు మొత్తం 375.90 కి.మీ. పాదయాత్ర పూర్తయింది.

Back to Top