వైయస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందాం
విశాఖ పాదయాత్ర సక్సెస్ మీట్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి
విశాఖపట్నం: రానున్న ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి పరిపాలించే అవకాశం ఇవ్వాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సూచించారు. విశాఖ జిల్లాలో పాదయాత్ర విజయవంతంగా పూర్తయిన సందర్భంగా విశాఖ ఫంక్షన్ హాల్‌లో పార్టీ నేతలతో విజయసాయిరెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి నగర పరిధిలోని ఏడు నియోజకవర్గాల సమన్వయకర్తలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలకు ఇంకా సుమారు ఏడు నెలలు ఉందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు అహర్నిశలు కష్టపడి విజయం దిశగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్నారు. వైయస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను ప్రతీ గడపకూ తీసుకెళ్లి ప్రజలను చైతన్యం చేయాలని, చంద్రబాబు మోసాలను వివరించాలని సూచించారు.
బ్రాహ్మణ విద్యార్థినికి రూ. లక్ష విరాళం
విశాఖలో వైయస్ జగన్ అధ్యక్షతన జరిగిన బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో ఓ పేద బ్రాహ్మణ విద్యార్థినీ తన గోడును వైయస్ జగన్‌కు చెప్పుకుంది. తన తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడని, తన చదువుకు ఫీజు కట్టలేని స్థితిలో కుటుంబం ఉందని సమస్యను జననేత దృష్టికి తీసుకురావడంతో వైయస్ జగన్ స్పందించి పార్టీ నేత ఎంవీవీ సత్యనారాయణను ఆదేశించారు. ఈ మేరకు విశాఖ ఫంక్షన్ హాల్‌లో జరిగిన పాదయాత్ర సక్సెస్ మీట్‌లో ఆ విద్యార్థినికి రూ. లక్ష చెక్కు అందజేశారు.