ప్రజా సంకల్ప యాత్ర విజ‌య‌వంతం చేద్దాం



ఈ నెలాఖరుకు శ్రీ‌కాకుళం జిల్లాకు వైయ‌స్ జగన్‌ పాదయాత్ర  
 వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ‌ ప్రధాన కార్యదర్శి   విజయసాయిరెడ్డి

శ్రీకాకుళం : ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఈ నెలాఖరు నాటికి శ్రీ‌కాకుళం జిల్లాలోకి ప్రవేశిస్తుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి వెల్లడించారు. ప్ర‌జా సంకల్ప యాత్రను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలైన పార్టీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, రాష్ట్రప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి తదితరులతో కలిసి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి  మాట్లాడుతూ జిల్లాలో 10 నియోజకవర్గాల ఇన్‌చార్జిలు పాదయాత్రకు సంబంధించి పూర్తి బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. పార్టీలో అన్ని కేడర్లవారి సమన్వయంతో ముందుకు నడిపించాలన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అన్ని కేడర్లను బలోపేతం చేసందుకు కష్టపడి పని చేయాలన్నారు. ప్రతి రోజూ అన్ని నియోజకవర్గంలో ఏదో ఒక కార్యక్రమం జరిగేలా పార్టీ అనుబంధ విభాగాలు బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లాలో ఏయే వర్గాల ప్రజలు ఎటువంటి సమస్యలతోఇబ్బంది పడుతున్నారో వాటిని గుర్తించి పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లేలా చూడాలన్నారు.

అనుబంధ సంఘాలు బాగా పని చేయాలి..
వైయ‌స్ఆర్‌సీపీ అనుబంధ సంఘాలు మొత్తం 22 ఉన్నాయని.. ఇందులోని సభ్యులతా పార్టీని బలోపేతం చేసేందుకు నిరంతరం ఏదో ఒక కార్యక్రమం చేపట్టి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన తెచ్చుకుని వాటిని పరిష్కరించేందుకు పార్టీ ఏ రకమైన కార్యక్రమాలు చేపట్టాలో తెలియజేయాలన్నారు. పార్టీ అధినేత జగన్‌ ప్రకటించిన నవరత్నాల్లాంటి పథకాలు  మహిళలకు, విద్యార్థులకు, రైతులకు, వృద్ధులకు, నిరుపేదలకు, అనారోగ్యాల పాలయ్యేవారికి ఏ విధంగా దోహదపడతాయో.. ఎలాంటి సేవలు అందుతాయో   సవివరంగా తెలియజేయాలన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామస్థాయి నుంచి అన్ని కేడర్ల నాయకులు రాత్రింబవళ్లు కష్టించి పనిచేయాలన్నారు. ప్రజాసంకల్పయాత్రలో అనుబంధ సంఘాలు రోజుకి నలుగురు చొప్పున బాధ్యత తీసుకుని పాదయాత్ర విజయవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు.  

కాల్‌సెంటర్లు ఏర్పాటు చేస్తాం:
రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో వైయ‌స్ఆర్‌సీపీ కాల్‌సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు విజయసాయిరెడ్డి చెప్పారు. అందుకు కావాల్సిన కంప్యూటర్లు, ఫర్నీచర్‌ అంతా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాల్‌ సెంటర్లను నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. కాల్‌ సెంటర్లు సక్రమంగా నిర్వహించే బాధ్యతను నియోజకవర్గ సమన్వయకర్తలు తీసుకోవాలన్నారు.

ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రజలందరికీ వైయ‌స్ఆర్‌సీపీ అమలు చేసే పథకాలన్నీ ప్రతి ఒక్కరికీ తెలియజేయడమే దీని ప్రధాన ధ్యేయమన్నారు.  మహిళల్లోకి అమ్మ ఒడి పథకాన్ని విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలపై కళాశాలలు, జనసమూహాల మధ్యలో, ప్రధాన కూడళ్లలో నవరత్నాల స్టాల్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. మిగిలిన అన్ని పథకాలను ఏ వర్గానికి చెందిన ప్రజలు అధికంగా ఉంటారో ఆ ప్రాంతంలో వాటిని సులభంగా తెలుసుకునేలా ప్రచార బోర్డులు, స్టాల్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ప్రసాదరాజు, పోలింగ్‌ బూత్‌ కమిటీల ఇన్‌చార్జి కె.రాజశేఖరరెడ్డిలతో పాటు పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, పాలకొండ, రాజాం ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, పలాస, టెక్కలి, ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల నియోజకవర్గాల సమన్వయకర్తలు సీదిరి అప్పలరాజు,  పేరాడ తిలక్, పిరియా సాయిరాజ్, గొర్లె కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Back to Top