<br/>అమరావతి) తెలుగు ప్రజల ఆశలు, ఆకాంక్షల మీద ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగం చేదు తుమ్మెర లా మిగిలిపోయింది. విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. తప్పితే రాష్ట్రమంతా ముక్తకంఠంతో కోరుతున్న ప్రత్యేక హోదా గురించి కానీ, చంద్రబాబు అండ్ బ్యాచ్ పాట పాడుతున్న ప్రత్యేక ప్యాకేజీల గురించి కానీ ఒక్క మాట మాట్లాడలేదు. శంకుస్థాపన వేదిక మీద ప్రసంగాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పోటీపడి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పొగడ్తలతో ముంచెత్తారు. పనిలో పనిగా చంద్రబాబు ఘనత ను చాటుకొనేందుకు తాపత్రయ పడ్డారు. చంద్రబాబు అయితే ఒకడుగు ముందుకు వేసి ప్రపంచంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని ప్రకటించేశారు. అమరావతి ని విశ్వ నగరం చేసేస్తున్నట్లు గ్రాఫిక్ కలను కళ్ల ముందుకు తెచ్చారు. <br/>ఎప్పటిలాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగం మీద అక్కడకు వచ్చిన జనం ఆసక్తి కనబరిచారు. ఆద్యంతం ఆంధప్రదేశ్ విశేషాలు, విభజన చట్టం హామీల గురించి ప్రధాని ప్రస్తావించారు. కానీ ప్రత్యేక హోదా గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. విబజన చట్టంలోని హామీలను వివరించారు. అప్పుడు హామీ ఇచ్చిన వివిధ కేంద్ర విద్యా సంస్థలు, పరిశోధన సంస్థల గురించి ప్రస్తావించారు. తెలుగులో ప్రసంగం మొదలెట్టి అభినందనలతో ముగించి ప్రసంగాన్ని పూర్తి చేశారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం పరస్పరం పొగడ్తలు, భజనలతో పూర్తయింది. ప్రజలకు అవసరమైన అంశాలు తప్ప అన్ని విషయాలు మాట్లాడిన చంద్రబాబు, వెంకయ్య నాయుడు కార్యక్రమాన్ని బాగా నడిపించారన్న మాట మాత్రం మిగిలింది.