ఊపందుకున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారం

అనంత‌పురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారం ఊపందుకుంది. ఈ నియోజ‌క‌వర్గానికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి, ఎన్జీఓ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వెన్నపూస గోపాల్‌రెడ్డికి మ‌ద్ద‌తుగా బెంగళూరు నుంచి ఐటీ విభాగం ప్రతినిధులు ప్ర‌చారం చేస్తున్నారు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు ఆకాంక్షించే పట్టభద్రులైన యువత, నిరుద్యోగుల చైతన్యమే లక్ష్యంగా గోపాల్‌రెడ్డికి ప్రచారం చేయడానికే తాము ప్ర‌చారం చేస్తున్న‌ట్లు ఈ సందర్భంగా ఐటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి చంద్రశేఖరరెడ్డి తెలిపారు. అలాగే పార్టీ నేత‌లు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించి వెన్న‌పూస గోపాల్‌రెడ్డికి తొలిప్రాధాన్యత ఓటు వేయాలని ప‌ట్ట‌భ‌ద్రుల‌ను అభ్య‌ర్థిస్తున్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నదీం అహ్మద్ అనంత‌పురం సప్తగిరి సర్కిల్‌లో ఉన్న ఈద్గా మసీదు సమీపంలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు. నదీంఅహ్మద్‌తో పాటు వెన్నపూస గోపాల్‌రెడ్డి, పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు ఎర్రిస్వామిరెడ్డి, మాజీ మేయర్‌ రాగే పరుశురాం, నాయకులు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీసాల రంగన్న తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా   వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ..ఎన్నికల ముందు చంద్రబాబు నమ్మించి ఓట్లు  దండుకున్నారన్నారు. అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం లేదంటే ప్రతినెలా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మూడేళ్లు అవుతున్నా పట్టించుకోలేదన్నారు. దీనికితోడు రాష్ట్ర విభజనతో అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది సంజీవినిలాంటిదన్నారు.ప్రత్యేకహోదా కల్పిస్తామని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు, వెంకయ్యనాయుడు ఈరోజు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెట్టారన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించాలనే లక్ష్యంగా తమ అధినేత వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి అలుపెరగని  పోరాటం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో త‌న‌ను గెలిపించి ప్రత్యేకహోదా ఉద్యమానికి మద్ధతు పలకాలని విజ్ఞప్తి చేశారు.  

కాగా, ఈనెల 21న నామినేషన్ల పరిశీలన, 23వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. మార్చి 9వ తేదీన ఉదయం   8 నుంచి సాయంత్రం 4 గంటల  వరకు పోలింగ్‌ ఉంటుంది.  
Back to Top