పేదల పొట్ట కొట్టి పెద్దలకు పెడతారా?



– దోపిడీని విస్తరింపజేసేందుకు చంద్రన్న మాల్స్‌ ఏర్పాటు
– న్యితావసర  వస్తువుల ధరలు తగ్గించాలనే చిత్తశుద్ధి లేదు
– సూటుకేసుల కోసమే చంద్రబాబు పనులు
–పోలవరం, రాజధాని పేరుతో దోచుకున్నారు
–చంద్రబాబు చేసేది ప్రతి పనీ స్వలాభం కోసమే
– కార్పొరేట్‌ దోపిడీకి పుల్‌ స్టాఫ్‌పెట్టాలి
 
హైదరాబాద్‌:  ఆహార భద్రత కల్పించేందుకే గత ప్రభుత్వాలు  ఏర్పటు చేసిన చౌకదుకాణాలను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. పేదలపై ప్రేమతో నాడు  ఎన్‌టీ రామారావు రూ.2 కిలో బియ్యం ఇచ్చారని, చంద్ర బాబు ఈ పథకానికి తూట్లు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు. కార్పొరేట్‌ శక్తులకు, నోట్ల కట్టలకు పుట్టిన బిడ్డగా ఈ ప్రభుత్వ పాలన ఉందని ఆమె అభివర్ణించారు. చంద్రన్న విలేజ్‌ మాల్స్‌ పేరుతో పేదల పొట్టి కొట్టి కార్పొరేట్‌ శక్తులకు పెడుతున్నారని ఆమె విమర్శించారు. చంద్రన్న విలేజ్‌ మాల్స్‌ ఏర్పాటును ఆమె తీవ్రంగా ఖండించారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రోజా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఈ నాలుగేళ్లలో రైతులకు గిట్టుబాటు ధర లేదని, సామాన్యులకు చౌకగా నిత్యావసర వస్తువులు అందడం లేదని రోజా విమర్శించారు. చంద్రబాబు పాలనలో ప్రజలు సర్వనాశనం అయ్యే పరిస్థితి నెలకొందన్నారు. 

సీఎం పదవి అడ్డుపెట్టుకొని..
దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం పదవిని అడ్డుపెట్టుకొని చిన్న చిన్న వ్యాపారుల పొట్టి కొట్టేందుకు చంద్రన్న విలేజ్‌ మాల్స్‌గా మార్చారని రోజా  మండిపడ్డారు. ఈ మాల్స్‌ స్వయంగా చంద్రబాబు కుటుంబానికి వాటాలు ఉన్న ఫ్యూచర్‌ గ్రూప్‌కు, వాళ్లకు సన్నిహిత సంబంధాలు ఉన్న రిలయన్స్‌ గ్రూప్‌లకు కట్టబెట్టారన్నారు. దీని అర్థం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఈ మాల్స్‌ వల్ల ప్రజలకు ఉపయోగం ఉందా అని నిలదీశారు. రేషన్‌షాపులో గతంలో 9 రకాల సరుకులు ఇచ్చేవారని, వాటన్నింటిని రద్దు చేసి, తీరా తన దోపిడీని విస్తరింపజేసేందుకు కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టారన్నారు. 5 నుంచి 35 శాతం తగ్గించి ఇస్తామని ప్రభుత్వం చెబుతుందని, ఈ రోజు ఫ్యూచర్‌ గ్రూప్‌ సంస్థ తన సంస్థకు లాభాలు లేకుండా పేదలకు ఎందుకు చౌకగా ఇస్తుందని ప్రశ్నించారు. గతంలో రిలయన్స్, ఫ్యూచర్‌ సంస్థలు వంద నుంచి 200 శాతం ప్రజల నుంచి గుంజుకున్నదన్నారు. రేషన్‌ షాపులను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. రేషన్‌షాపుల్లో ప్రభుత్వమే నిత్యావసరాలు ఇస్తే పేదలకు లాభం ఉంటుందని, చంద్రన్న మాల్స్‌ పేరుతో వేల కోట్లు దండుకోవాలన్నదే టీడీపీ ధ్యేయమన్నారు. మీకు పేదలపై ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే బహిరంగ మార్కెట్‌లో రేట్లు తగ్గింవచ్చు అన్నారు. పేదవాళ్లు ఏమైతే నాకేంటి అన్నట్లుగా చంద్రబాబు తాను, తన కొడుకు బాగుంటే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ధరల స్థిరీకరణ నిధి రూ.5 వేల కోట్లతో ఏర్పాటు చేస్తామని చెప్పిన చంద్రబాబు మాట తప్పారన్నారు. బాబు తన సీఎం పదవిని అడ్డుపెట్టుకొని దోచుకుంటున్నారన్నారు.


21 పథకాలకు చంద్రన్న పేర్లు
 భవిష్యత్తులో తనను  మరిచిపోతారన్న భయం చంద్రబాబులో ఉందని, అందుకే ఈ నాలుగేళ్లలో 21 ప్రభుత్వ పథకాలకు చంద్రన్న పేరు పెట్టుకున్నారని రోజా విమర్శించారు. చంద్రబాబు తన తండ్రి ఖర్జూరపు నాయుడు వాటా తీసుకొని వచ్చి ఇస్తున్నారా  అని నిలదీశారు. అంతగా పేర్లు పెట్టుకోవాలంటే ప్రజలకు మేలు చేసిన ఎన్‌టీఆర్, ఇందిరాగాంధీ,  దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి లాంటి కీర్తిశేషుల పేర్లు పెట్టుకోవాలి కానీ, ఇలా తన పేరు పెట్టుకోవడం ఎక్కడా చూడలేదన్నారు. భవిష్యత్తులో ప్రజలు  పట్టించుకోరనే భయంతోనే చంద్రబాబు ఇప్పుడే తన పేరుతో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. చంద్రన్న కానుకలో నెయ్యి ఇస్తామన్నారు. ఆ నెయ్యిని హెరిటేజ్‌ కంపెనీ  నుంచి తెప్పించారన్నారు. చంద్రన్న చలివేంద్రాలకు హెరిటేజ్‌ నుంచి పెరుగు తెప్పించారన్నారు. భవిష్యత్తులో దోచుకోవడానికి అవకాశం ఉంటుందో? లేదో అన్న భయంతో చౌకదుకాణాలను రిలయన్స్‌ సంస్థకు ఇచ్చి దోచుకునే కుట్ర చేస్తున్నారన్నారు. తక్షణమే ఈ కార్పోరేట్‌ దోపిడీకి పుల్‌ స్టాఫ్‌పెట్టాలని, ప్రభుత్వమే గతంలో మాదిరిగా 10 రకాల సరుకులు రేషన్‌షాపుల్లో ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ప్రజా ఉద్యమం ఉధృతం చేస్తామని రోజా హెచ్చరించారు.

ప్రజలకు మేలు చేసే ఆలోచన లేదు
రాజకీయ అవగాహన లేని లోకేష్‌ను ఎమ్మెల్సీ చేసి ఆ తరువాత మంత్రిని చేశారో అప్పటి నుంచి  సూట్‌కేసు గురించే చంద్రబాబు పని చేస్తున్నారు తప్ప, ప్రజలకు మేలు చేయడం లేదని రోజా విమర్శించారు.  రాజధాని భూముల పేరుతో లక్షల కోట్లు సంపాదించారన్నారు. పోలవరంలో అవినీతి నెలకొందని,  పట్టిసీమలో రూ.350 కోట్లు దోచుకున్నారని కాగ్‌ రిపోర్టు ఇచ్చిందన్నారు. బొగ్గు, మట్టి, మద్యం, ఇసుక వ్యాపారాలతో వందల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. పిల్లనిచ్చిన మామనే వెన్నుపొటు పొడిచిన నీకు ప్రజలను మోసం చేయడం ఓలెక్కా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ సుజల స్రవంతి అన్న పేరు పెట్టి పేదలకు నీరు ఇవ్వలేకపోయారంటేనే ,  మీ మామపై ఎంత ప్రేమ ఉందో ఇక్కడే తెలిసి పోయిందన్నారు. లొసుగులన్ని బయట పెట్టి ప్రజల చేత తరిమికొట్టిస్తామని రోజా చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

 
Back to Top