‌చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి నయవంచకులు

హైదరాబాద్:

కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు చీడపురుగుల మాదిరిగా తయారై రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, వారిద్దరూ ఇద్దరు నయవంచకులని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాక‌ర్‌రెడ్డి నిప్పులు చెరిగారు. వీరిద్దరూ చిత్తూరు జిల్లా వాసులను తలదించుకునేలా ప్రవర్తించి చరిత్రహీనులుగా మిగిలారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో భూమన మాట్లాడారు.

కాంగ్రెస్ ‌పార్టీ కోర్‌ కమిటీ, సీడబ్ల్యూసీ సమావేశాలలో రాష్ట్ర విభజనకు అనుకూలంగా గంగిరెద్దులా తలూపిన కిరణ్ ‌కల్లబొల్లి మాటలతో ప్రజలను నిట్టనిలువునా మోసగించారని భూమన దుయ్యబట్టారు. ఉద్యోగులు చేసిన మహోగ్ర ఉద్యమాన్ని నీరుగార్చి విభజనకు కిరణ్ అన్ని విధాలుగా రహదారులు వేసి సోనియా తొత్తులా వ్యవహరించారని ‌తూర్పారపట్టారు. రాజకీయ సంక్షోభం సృష్టిద్దామని వైయస్ఆర్‌సీపీ మొదటి నుంచి చెబుతుంటే పెడచెవిన పెట్టి, తమ నిజాయితీనే శంకిస్తూ కిరణ్ ఎదురుదాడికి దిగారని‌ భూమన గుర్తుచేశారు. అడపాదడపా ప్రెస్‌మీట్లు పెట్టి నాలుగు మాటలు చెప్పి తన తాబేదార్లు, ఉద్యోగుల నాయకుడి చేత ‘సమైక్య సింహం’ అనిపించుకున్నారు తప్పితే ఏనాడూ రాష్ట్ర సమైక్యత కోసం కిరణ్ కృషి చేయలేదన్నారు. సమైక్య ముసుగులో కిర‌ణ్ ఆరు నెలలుగా రెండు చేతులతో సంతకాలు చేస్తూ డబ్బులు దండుకోవడమే పనిగా పెట్టుకున్నారన్నారు.

‌మరో నయవంచకుడైన చంద్రబాబు రాష్ట్రంలో ఇరు ప్రాంత నేతలను ఉసిగొల్పి రసవత్తరమైన నాటకంలో విదూషకుడిగా మిగిలారని కరుణాకరరెడ్డి విమర్శించారు. సీమాంధ్రకు జరిగే నష్టాన్ని ఒక్క రోజున కూడా ప్రస్తావించకుండా కొబ్బరికాయల సిద్ధాంతంలో ప్రజలకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారన్నారు. సీడబ్ల్యూసీ ప్రకటన వెలువడిన తర్వాతి రోజు ప్రెస్‌మీట్ పెట్టి సీమాంధ్రకు నాలుగైదు లక్షల కోట్లు కావాలంటూ ప్రజల మనోభావాలను తాకట్టుపెట్టారని బాబుపై నిప్పులు చెరిగారు.

‌రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం మొదటి నుంచి చిత్తశుద్ధితో పనిచేస్తున్నది వైయస్ఆర్‌సీపీ మాత్రమే అని భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికీ సమైక్యాంధ్రను నిలబెట్టుకోవాలన్న ఆశతో సుప్రీం కోర్టుకు కూడా వెళ్లామని ఆయన చెప్పారు.

Back to Top