సమైక్య రాష్ట్రమే మా విధానం: బాలినేని

ఒంగోలు (ప్రకాశం జిల్లా),

2 అక్టోబర్ 2013: మన రాష్ట్రం సమైక్యంగా ఉండాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కోరుకుంటోందని నియోజకవర్గం సమన్వయకర్త, పార్టీ విప్‌ బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. విభజన అనివార్యమైతే ఇరు ప్రాంతాల్లో ఎలాంటి అన్యాయం జరగకుండా కన్న తండ్రి స్థానంలో ఉండి ఆలోచించి నిర్ణయం చేయాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి మొదటి నుంచీ చెబుతున్నారని ఆయన గుర్తుచేశారు. ఒంగోలులోని కలెక్టరేట్‌ ఎదురుగా ఏర్పాటు చేసిన శిబిరంలో ఆయన బుధవారం ఉదయం సమైక్య నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున దీక్షలో పాల్గొన్నారు.

కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే మన రాష్ట్రాన్ని విడదీశారని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. అయితే.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే ‌లక్ష్యంతోనే శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఉద్యమానికి ముందువరుసలో ఉన్నారని ఆయన తెలిపారు. సమైక్యాంధ్ర కోసమే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేసిన వైనాన్ని బాలినేని ప్రస్తావించారు. తాము రాజీనామాలు చేసిన నేపథ్యంలో మిగతా పార్టీల సీమాంధ్ర నాయకులు కూడా పదవుల నుంచి తప్పుకుంటారని, తద్వారా విభజన ప్రక్రియ నిలిచిపోతుందని తాము భావించామన్నారు. అయితే.. కాంగ్రెస్, టిడిపి నాయకులు ముందుకు రాలేదన్నారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్‌ రావడంపైన కూడా కొందరు రాజకీయం చేస్తున్నారని ఈ సందర్భంగా బాలినేని నిప్పులు చెరిగారు. రాజ్యాంగం ప్రకారం నిందితులెవరికైనా 90 రోజుల్లో బెయిల్‌ రావాల్సి ఉందని, కాని శ్రీ జగన్‌కు బెయిల్‌ రానివ్వకుండా 16 నెలల పాటు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీ జగన్‌ బెయిల్‌పై ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు నాయుడు ఒక్క మాట మీద నిలబడే వ్యక్తి కాదన్నారు. రాష్ట్రాన్ని మీ ఇష్టం వచ్చినట్లు విభజించుకోండంటూ కేంద్రానికి బ్లాంక్‌ చెక్కులాంటి లేఖ ఇచ్చిన చంద్రబాబు తన విధానాన్ని స్పష్టంగా చెప్పడంలేదన్నారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్న వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ను ఆయన విమర్శించడమేమిటని నిలదీశారు.

Back to Top