<strong>గుంటూరు : </strong>చంద్రబాబు నాయుడి వంచన నైజం మరోసారి స్పష్టంగా బయటపడిందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా, గుంటూరు జిల్లాల కో ఆర్డినేటర్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) విమర్శించారు. వంచన, కుమ్మక్కు రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని మరోసారి శాసనసభలో అవిశ్వాసంపై జరిగిన ఓటింగ్ సమయంలో రాష్ట్ర ప్రజలందరికీ సృష్టమైందని ఆర్కే అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో తాకట్టుపెట్టారని కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నాడు దివంగత ఎన్టీఆర్ టిడిపిని స్థాపిస్తే.. నేడు అదే పార్టీని చంద్రబాబు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. గుంటూరు అరండల్‌పేటలో శనివారం తనను కలిసిన విలేకరులతో ఆర్కే మాట్లాడారు.<br/>ప్రజావ్యతిరేక, రైతుకంటక పాలన సాగించే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉంటే.. చంద్రబాబు మాత్రం అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్మెల్యేల బలం ద్వారా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి పీఠాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మద్దతిచ్చి కాపాడడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు.<br/>రాష్ట్రం లో దిక్కులేని స్థితిలో ఉన్న కాంగ్రెస్‌కు అన్నీ తానై 30 ఏళ్ల పాటు పార్టీకి సేవ చేసి రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి తీసుకువచ్చిన దివంగత మహానేత డాక్టర్ వైయస్‌ఆర్‌ను కాంగ్రెస్ నమ్మకద్రోహం చేసిందని ఆర్కే ఆరోపించారు. మహానేత వైయస్ మరణానంతరం ఆయన పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చి చారిత్రక ద్రోహానికి పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.