మహిళలపై అఘాయిత్యాలకు నిరసన

హైదరాబాద్:

దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైయస్ఆర్  కాంగ్రెస్ మహిళా విభాగం ఆవేదన వ్యక్తం చేసింది. చేతకాని పాలకుల కారణంగా ప్రతిరోజూ మహిళలపై దురాగతాలు  చోటుచేసుకుంటున్నాయని దుయ్యబట్టింది. పాలకులకు చేతకాకపోతే పక్కకు తప్పుకోవాలని డిమాండ్ చేసింది. ఢిల్లీ సంఘటనకు నిరసనగా ఆదివారం హైదరాబాద్ నెక్లెస్‌ రోడ్డులో మౌన ప్రదర్శన, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి మాట్లాడుతూ, వయస్సుతో నిమిత్తం లేకుండా ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

యూపీఏకు నేత మహిళ అయినప్పటికీ మహిళలపై పట్ల ఇలాంటి దురాగతాలను అరికట్టలేకపోవడం సిగ్గుచేటన్నారు. ఢిల్లీ సంఘటనపై ప్రధాని మన్మోహన్‌సింగ్ నిస్సహాయత వ్యక్తం చేయడాన్ని తప్పుపట్టారు. దోషులను శిక్షించడం చేతకాకపోతే వారిని మహిళలకు అప్పగించాలని, ఇలాంటి దారుణాలు పునారావృతం కాకుండా బుద్ధి చెబుతామన్నారు. ఆడవారిని పూజించే గడ్డమీదే వారు బయటకు వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని పార్టీ కేంద్ర కార్యానిర్వాహక మండలి సభ్యురాలు పి.విజయారెడ్డి విచారం వ్యక్తంచేశారు. గతంలో వయసొచ్చిన ఆడపిల్లను బయటకు పంపడానికి తల్లిదండ్రులు భయపడేవారనీ, ప్రస్తుతం నడకవచ్చిన పాపాయిని పంపడానికి సైతం భయపడుతున్నారని చెప్పారు. మహిళలపై వేధింపులను అరికట్టేందుకు కఠిన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా పోలీస్‌స్టేషన్‌లు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నేరస్తులపై విచారించి నెల్లాళ్లలోపే వారికి మరణశిక్ష విధించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ ఐటీ విభాగం కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డి, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Back to Top