<strong>పెడన (కృష్ణాజిల్లా) :</strong> దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి మీద, ఆయన కుటుంబంపైన నిందలు, ఆరోపణలు చేయడంతొ తాను తీవ్రంగా కలతచెందానని, అందుకే అవిశ్వాసానికి అనుకూలంగా అసెంబ్లీలో ఓటు వేశానని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ తెలిపారు. కృష్ణా జిల్లా పెడనలోని తన కార్యాలయంలో వైయస్‌ఆర్ అభిమానులు, కార్యకర్తలతో అదివారం ఆయన భేటీ అయ్యారు. కాంగ్రెస్, టిడిపి సభ్యులు శాసనసభలో అవిశ్వాసంపై చర్చించకుండా కేవలం వైయస్‌పై విమర్శలు చేయడమే తమ పని అన్నట్లుగా వ్యవహరించడాన్ని రమేష్ తప్పు పట్టారు.<br/>మహానేత డాక్టర్ వైయస్‌ఆర్ ఆశీస్సులతోనే తాను ఎమ్మెల్యేగా గెలిచినట్లు జోగి రమేష్ స్పష్టం చేశారు. తనకు మహానేత వైయస్సే టిక్కెట్ ఇచ్చి గెలిపించారని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ 180 నుంచి 200 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ జగన్ జైల్లో ఉన్నా శ్రీమతి విజయమ్మ, శ్రీమతి షర్మిల, శ్రీమతి వైయస్ భారతి నేతృత్వంలో పార్టీ విజయపథంలో ముందుకు దూసుకుపోవడం ఖాయం అన్నారు.