సమగ్ర నీటి పథకానికి గ్రహణం

పట్నంబజారుః గుంటూరు నగర ప్రజలకు 24/7 ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన సమగ్ర మంచినీటి పధకం పనులకు గ్రహణం వీడేదేప్పుడో అర్ధంకాని పరిస్ధితులు దాపురించాయని వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అరండల్‌పేటలోని పార్టీ నగర కార్యాలయలలో గురువారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. 2012 సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్ధాపన చేసి 2016 మార్చి నాటి పనులు పూర్తి చేస్తామని ఆర్భాటంగా చెప్పిన అధికారులు కనీసం పట్టించుకోని పరిస్ధితులు కనపడుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వాలు మారాయి కమిషనర్లు మారినప్పటీకీ పనులు మాత్రం నత్తేనయంగా కనపడుతున్నాయని ధ్వజమెత్తారు. గడుపులోపు పనులు పూర్తిచేయని కాంట్రాక్టర్లు, అధికారులప ఎటువంటి చర్యలు తీసుకోకపోగా మూడు సార్లు గడువు పెంచి నిర్లక్ష్యాన్ని సమర్ధించటం సిగ్గుచేటన్నారు. రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రి నిత్యం నగరంలో పర్యటిస్తున్నా..పధకం ఊసే ఎత్తకపోవటం దారుణమని మండిపడ్డారు. ప్రజలకు కనీసం తాగటానికి మంచినీళ్ళు అందించలేదని వారు ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన రాజధాని ఎలా నిర్మిస్తారోనని..ప్రజలు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. గుంటూరు రాజధాని ప్రాంతమైన నేపధ్యంలో జనాభా 10లక్షలకు చేరిందని, నిత్యం నగరంలో ప్రజలకు 140 ఎంఎల్‌డీ నీరు అవసరం కాగా కేవలం 80 నుండి 90 ఎంఎల్‌డీల నీరు మాత్రమే సరఫరా చేస్తున్నారని తెలిపారు. నులకపేల రైల్వే క్రాసింగ్‌ వద్ద కల్వర్టుల నిర్మాణానికి అనుమతులు ఇప్పటి వరకు ఇవ్వలేదని, అలాగే నెహ్రునగర్‌ నుండి గుంటూరు పశ్ఛిమ నియోజకవర్గానికి నీటిని సరఫరా చేసే పైపుల సామార్ధ్య పెంపుదలపై నేటి టెండర్‌ ప్రక్రియ మొదలుకాకపోవటం అధికారుల పనితీరుకు అద్దం పడుతోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని లేని పక్షంలో ప్రజల పక్షాన ఉద్యమబాట పట్టాల్సివస్తుందని హెచ్చరించారు.

Back to Top