ఏం జన్మ నీది? చంద్రబాబూ: మేకపాటి

హైదరాబాద్, 27 అక్టోబర్ 2013 :

‘రాష్ట్రాన్ని విభజించాలంటూ కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు దాన్ని వెనక్కి తీసుకోకపోతే తెలుగుజాతి ఆయనను క్షమించదు. ఈ అపవాదు ఆయన జన్మకే గాక ఆయన బిడ్డలకూ ఉంటుంది. రాష్ట్రానికి 50 శాతం ఆదాయం వచ్చే హైదరాబాద్ నగరం లేకుండా ఈ రాష్ట్రం ఎలా నడుస్తుందని ‌చంద్రబాబు అనుకుంటున్నారు? తెలంగాణలో పుట్టిన వారిగా కొందరు రాష్ట్రాన్ని విభజించాలని కోరుకోవడంలో ఒక అర్థముంది. కానీ బాబూ! చిత్తూరు జిల్లాలో పుట్టిన వాడివి, నువ్వెలా (అందుకు) సిద్ధపడ్డావ్? ఏం జన్మ నీది? మనిషి రూపంలో ఉన్న వికృత రూపుడివి నువ్వు. రాజశేఖరరెడ్డి చనిపోయాక రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని సోనియా ప్రయత్నించడం దారుణం. కేసీఆర్, జానారెడ్డి, దామోదర రాజనర్సింహ వంటి వారు ముఖ్యమంత్రి కావాలనుకుంటే తెలుగు ప్రజలందరి ఆమోదంతో ఆ పదవి తీసుకోవాలి. ఆరు నెలల కాలంలోనే శ్రీ జగన్మోహన్‌రెడ్డి వంటి సరైన నాయకత్వం రాష్ట్రాన్ని పాలించనుంది. అందు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు’.

మంత్రి పదవిని వదులుకున్నా: విశ్వరూప్ :

‘విభజన వల్ల తలెత్తే సమస్యలేమిటో తెలుసు కాబట్టే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని నినదించి మంత్రి పదవికి రాజీనామా చేశా. సమైక్యాంధ్ర కోసం ఎన్జీవోలు సమ్మె చేసినా కేంద్రం స్పందించలేదు. వారు సమ్మె విరమించాక ఉద్యమంలో విరామం వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్ చాలా స్పష్టంగా సమైక్యాంధ్ర నినాదంతో ముందుకొచ్చింది.  సమైక్యాంధ్రప్రదే‌శ్ కోసం పోరాడగలిగేది వై‌యస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. అందుకే నేనందులో చేరాను.’

సమైక్యంగా ఉంటేనే దళితుల అభివృద్ధి: నల్లా:

‘రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే దళితుల అభివృద్ధి సాధ్యమవుతుంది. మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రజలు కూడా బాగా లబ్ధి పొందారు. మళ్లీ అలాంటి పథకాల అమలు శ్రీ జగనన్ వల్లే సాధ్యమని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. ఆయన సీఎం కావాలని కోరుకుంటున్నారు’‌.

వాదనల మధ్య ఘర్షణ: గట్టు :
‘రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నది రెండు ప్రాంతాల మధ్య ఘర్షణ కాదు, రెండు వాదన మధ్య ఘర్షణ. తీర్పేమిటో ప్రజలే చెబుతారు. స్వాతంత్య్రోద్యమ సమయంలోనూ తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు హామీ ఇస్తేనే ఉద్యమంలో పాల్గొంటామని అప్పట్లో ఇక్కడి నేతలు గాంధీకే తేల్చిచెప్పారు. సమైక్యాంధ్ర రాష్ట్రానికే శ్రీ జగన్ ముఖ్యమంత్రి కావాలని మేం కోరుకుంటున్నాం’.

తీర్మానంతో బాబు ముందుకు రావాలి: దాడి :
‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ తీర్మానం చేయడానికి చంద్రబాబు ముందుకు రావాలి. పీసీసీ కూడా అలాంటి తీర్మానం చేయాలి. అప్పుడే టీడీపీ, కాంగ్రెస్‌లను ప్రజలు నమ్ముతారు. విభజనకు ఉత్సాహం చూపుతున్న సోనియా, చంద్రబాబులను బహిష్కరించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు’.

విభజిస్తే దిశ దశ ఉండవు: గోపాల్‌రెడ్డి, ఏపీఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు :

‘రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తే దిశ దశ ఉండవు. హైదరాబాద్ నగరం మనదని భావించే కోస్తాలో ఎకరాలు అమ్ముకుని ఇక్కడ గజాల స్థలం కొని అభివృద్ధి చేశాం. ఐటీ, ఫార్మా అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాక, ఇప్పుడు వెళ్లిపోమడం ఎంతవరకు సమంజసం?’‌.

అభినందనీయం : ఏవీ పటేల్, సీమాంధ్ర గెజిటెడ్ అధికారుల జేఏసీ నేత‌ :
‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఉద్యమిస్తున్న వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి, శ్రీ జగన్మోహన్‌రెడ్డికి హృదయపూర్వక అభినందనలు.  కొందరు నేతలు రహస్య ఎజెండాతో విభజనతో మన భవిష్యత్తును అంధకారం చేయజూస్తున్నారు’.

విద్యార్థుల భవిష్యత్తేమిటి?: అడారి కిషోర్‌కుమార్, సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నేత :

‘రాష్ర్టం విడిపోతే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. చదువుల తర్వాత తమ భవిష్యత్తేమిటనే బెంగ వారిలో ఉంది. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయాన్ని సీమాంధ్రలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థులమూ స్వాగతిస్తున్నాం’.

Back to Top