గురజాలను గంజాయి మయం చేశారు

గుంటూరుః  ప్రభుత్వం గురజాలను గంజాయి మయం చేస్తోందని  వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేకాట, గనులు, మద్యం అమ్మకాలు, కాంట్రాక్టర్ల నుంచి పర్సంటేజీల వరకు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు సంబంధం లేదా అని సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం తీసివేసిన జీవీఆర్‌ క్లబ్‌ నిర్వాహకులు.. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాలను వదిలేసి మారుమూల గ్రామంలో క్లబ్‌ పెట్టేందుకు ఎమ్మెల్యే యరపతినేని సహకరించారనేది వాస్తవం కాదా అని నిలదీశారు. రూ.కోటి విలువ చేసే గంజాయిని క్యాపిటల్‌ కల్చరల్‌ క్లబ్‌కు తీసుకెళ్తున్నట్లు ఆ వాహన డ్రైవర్‌ పోలీసుల వద్ద ఒప్పుకొన్న విషయం విదితమేనన్నారు. ఎమ్మెల్యే అండదండలు ఉండటంతోనే ఆగడాలు అధికమైపోతున్నాయని ధ్వజమెత్తారు.

బెల్టుషాపులతో యువత, విద్యార్థులు పెడదోవ పడుతున్నారని, కొత్తగా గంజాయితో వారి జీవితాలను నాశనం చేసే చర్యలపై తీవ్రంగా ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు. ఎస్‌ఐ, సీఐ, డీఎస్పీలను ఆయనకు కావాల్సిన వారికి పోస్టింగ్‌లు ఇప్పించిన యరపతినేని, ఇదేమని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. గంజాయి అంశానికి సంబంధించి తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 
Back to Top