కరెంటు వచ్చేది తక్కువ.. బిల్లులు ఎక్కువ

పత్తికొండ, 10 నవంబర్‌ 2012: మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకు తూట్లు పొడుస్తూ ఆయన పేరు లేకుండా చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని షర్మిల ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమయిందని విమర్శించారు. వై‌యస్ లేకపోవడంతో హంద్రీ‌ నీవా పథకం పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాకే హంద్రీ నీవా పథకాన్ని చేపట్టారని షర్మిల గుర్తుచేశారు. రాజన్న బ్రతికి ఉంటే ఈ పథకం పూర్తి చేసేవారన్నారు. 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా పత్తికొండలోని వైయస్‌ఆర్ సర్కిల్‌లో‌ శనివారం రాత్రి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు.

రాష్ర్ట ప్రభుత్వం పెడుతున్న కష్టాలతో మహిళలు విలపిస్తున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరినీ అక్క చెల్లెళ్ళుగా చూసుకున్నారన్నారు. ఏనాడూ ఆయన గ్యాస్‌ ధరలు పెరగనివ్వలేదని గుర్తుచేశారు. ఇప్పుడు గ్యాస్‌ ధరలు ఆకాశాన్ని అంటాయని. విద్యుత్‌ వచ్చేది తక్కువ, బిల్లులు ఎక్కువ అని ఆడపడుచులు ఆవేదన చెందుతున్నారన్నారు. ఉపాధి హామీ పథకం పని ఎక్కడా దొరకడం లేదని, విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్‌ అందడంలేదన్నారు. తమ పిల్లలను ఎలా చదివించుకోవాలి? ఈ ప్రాంతంలో తాము ఉండాలా మరెక్కడికైనా వలస వెళ్ళిపోవాలా? అని వారంతా విచారంలో మునిగిపోయారని షర్మిల విచారం వ్యక్తం చేశారు. వైయస్‌ బ్రతికి ఉంటే విద్యార్థులందరినీ తన సొంత బిడ్డల్లా చూసుకున్నారని తెలిపారు. ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదివేందుకు ఆయన ఎంతగానో సహాయ, సహకారాలు అందించారన్నారు.

ఆరోగ్యశ్రీ పథకం ఇప్పుడు పడకేసిందన్నారు. ఆపదలో ఉండి ఒక్క ఫోన్‌ చేసిన 20 నిమిషాల్లో కుయ్‌... కుయ్‌... కుయ్‌ మంటూ వచ్చే 108 వాహనాలు మూలనపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ పథకాన్నింటినీ పూర్తిగా విస్మరించిందని దుయ్యబట్టారు. వ్యవసాయానికి 9 గంటలు ఉచిత విద్యుత్‌ ఇస్తామని వైయస్‌ చెప్పారన్నారు. ఆయన ఉండి ఉంటే కచ్చితంగా ఇచ్చేవారని చెప్పారు.

ఇలాంటి అసమర్థ ప్రభుత్వాన్ని నిలదీయకుండా ప్రధాన ప్రతిపక్షం మూడేళ్ళుగా చోద్యం చూస్తోందని షర్మిల దుయ్యబట్టారు. రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి రావడానికి ఎన్టీఆర్‌ ఇచ్చిన హామీలు రెండు ఉన్నాయన్నారు. అవి కిలో రెండు రూపాయల బియ్యం, పూర్తి మద్యపాన నిషేధం అన్నారు. అయితే, చంద్రబాబు వాటిని తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. చంద్రబాబు అధికారంలో ఉన్న ఎనిమిదేళ్ళలో ఎనిమిది సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచిన ప్రబుద్ధుడు బాబు అన్నారు. చంద్రబాబు పెట్టిన బాధలు తట్టుకోలేక వందలాది మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నారు. బకాయిలు కట్టలేక నాలుగువేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారందరినీ చంద్రబాబే పొట్టనపెట్టుకున్నారని ఆరోపించారు. ఇన్ని చేసిన చంద్రబాబు ఇప్పుడు పాదయాత్ర అంటూ బయలుదేరారని ఎద్దేవా చేశారు.

గతంలోని తన పరిపాలననే మళ్ళీ తీసుకువస్తానని చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదని షర్మిల విమర్శించారు. వైయస్‌ పథకాలనే తెస్తానని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. చంద్రబాబు మీద విశ్వాసం లేకే టిడిపి నుంచి అనేక మంది వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. మాట ఇవ్వడం అంటే ఏమిటో, దాన్ని నిలబెట్టుకోవడం ఏమిటో చంద్రబాబుకు ఈ జన్మలో అర్థం కాదన్నారు. సొంత మామనే వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.

అబద్ధపు కేసులు పెట్టి జగనన్నను విచారణ పేరుతో జైలులో పెట్టారని షర్మిల నిప్పులు చెరిగారు. రెండెకరాల చంద్రబాబుకు ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని కమ్యూనిస్టులు పుస్తకం వేశారని గుర్తుచేశారు. అయితే, ఆయనపై ఈ ప్రభుత్వం విచారణ చేయదట అని ఎత్తిచూపారు. ఐఎంజీ భూములను కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకు చంద్రబాబు ధారాదత్తం చేసేనాటికి ఆయన ముఖ్యమంత్రి కాదని, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అని షర్మిల వివరించారు.

పాదయాత్రలో చంద్రబాబు ఇస్తున్న హామీలు చూస్తుంటే నవ్వొస్తుందని షర్మిల అన్నారు. కాంగ్రెస్ వాళ్లు సీబీఐని వాడుకుని జగ‌న్‌ను జైలుపాలు చేశారన్నారు. చంద్రబాబుపై ఎన్ని ఆరోపణలున్నా సిబ్బంది లేరని సాకులు చెబుతున్న సీబీఐ, జగనన్నపై 28 బృందాలను రంగంలోకి దింపిందని షర్మిల తెలిపారు. టీడీపీ, కాంగ్రెస్ కలిసి నీచమైన కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. కాంగ్రె‌స్, టీడీపీలు దుకాణం మూసుకోవాల్సి వస్తుందనే జగనన్నను జైలుకు పంపాయని అన్నారు. జనం మని‌షి జగన్ అని షర్మిల అభివ‌ర్ణించారు. రాజన్న ఇచ్చిన హామీలన్నింటినీ జగనన్న నెరవేరుస్తాడని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రాజన్న సువర్ణయుగం మళ్లీ వస్తుందని షర్మిల అన్నారు.

జనాభిమానంతో పోటెత్తిన పత్తికొండ:
'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్రలో భాగంగా షర్మిల కర్నూలు జిల్లా పత్తికొండకు చేరుకున్నారు. వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ‌షర్మిలకు ఆత్మీయ స్వాగతం పలికారు. పత్తికొండ వైయస్‌ఆర్ సర్కి‌ల్‌లో ఏర్పాటు చేసిన సభలో షర్మిల పాల్గొన్నారు. రాజన్న తనయను చూసేందుకు భారీ ఎత్తున తరలివచ్చిన జనంతో పత్తికొండ పోటెత్తింది. ఎటు చూసినా జనమే కనిపించారు. పత్తికొండ దారులన్నీ జనంతో నిండిపోయాయి.
Back to Top