వైయస్‌ను కాపీ కొడుతున్నచంద్రబాబు!చిన్నకొండయ్యపల్లె 25 అక్టోబర్ 2012 : టిడిపి అధినేత చంద్రబాబుది కాపీ పాదయాత్ర అని షర్మిల ఎద్దేవా చేశారు. నాడు వైయస్ పాదయాత్ర చేసినప్పుడు విమర్శించిన చంద్రబాబే ఇప్పుడు అదే పాదయాత్రను కాపీ చేస్తున్నారని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. వైయస్ఆర్ పాదయాత్ర చేసినప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానాలను చంద్రబాబు ఎగతాళి చేశారనీ, అవన్నీ నెరవేరాలంటే హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకొమ్మన్నారనీ షర్మిల గుర్తు చేశారు. 'కానీ వైయస్ సీఎం అయ్యారు. అవడమే కాదు, తాను చేసిన వాగ్దానాలనన్నిటినీ నిలబెట్టుకున్నారు' అని ఆమె అన్నారు. అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న షర్మిల ప్రజలతో మాట్లాడుతూ చంద్రబాబు తీరును తప్పుబట్టారు. ఆనాడు వైయస్ పాదయాత్రను విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు వైయస్ఆర్ పథకాలనే అమలు చేస్తామంటున్నారని ఆమె ఎత్తిపొడిచారు.  "మరింత మెరుగైన ఆరోగ్య శ్రీ  తెస్తారట. రైతుల రుణాలు మాఫీ చేస్తారట. ఫీజు రీ ఇంబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేస్తారట. ఇవన్నీ వైయస్ పథకాలు. వీటినే చంద్రబాబు కాపీ చేస్తున్నారు" అని షర్మిల అన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రుణాలు మాఫీ చేయమని కోరుతూ కేంద్రానికి ఒక్క ఉత్తరమూ రాసిన పాపాన పోలేదని ఆమె చంద్రబాబు తీరును ఎండగట్టారు. కానీ రాజశేఖర్ రెడ్డిగారు 12 వేల కోట్ల రూపాయల మేరకు రైతు రుణాలను మాఫీ చేయించారని ఆమె గుర్తు చేశారు. నాడు వైయస్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండిందనీ, నేడు దిగజారిన పరిస్థితి చూస్తే బాధ కలుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కానీ దేవుడున్నాడనీ కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కు కుట్రకు జైలు పాలైన జగనన్నను దైవుడే బయటకు తీసుకువస్తాడనీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనీ, రాజన్న రాజ్యం వస్తుందనీ, కోటి ఎకరాలకు నీరు అందించాలన్న రాజశేఖర్ రెడ్డి కలను జగనన్న నిజం చేస్తాడనీ, రైతులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తాడనీ, వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాడనీ షర్మిల భరోసా ఇచ్చారు.
పలుచోట్ల షర్మిల ప్రజలతోనే సమస్యలు చెప్పించారు. సమస్యలు చెప్పమని జనాన్ని కోరుతున్నారు. కరెంటు, నీళ్ల సమస్యలతో తల్లడిల్లుతున్నవారిని ఓదార్చుతున్నారు.
అదనపు సిలిండర్లు అవసరం లేని దీపం పథకంవారికి మాత్రం సిలిండర్లు ఇస్తామంటున్నారని షర్మిల ఎద్దేవా చేశారు. ఈ గారడీ చూడండి,  వారెలాగు అదనపు సిలిండర్లు అడగరని వారికిస్తామంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు. వైయస్ ఉన్నన్నాళ్లూ గ్యాస్ ధర పెంచనివ్వలేదని ఆమె గుర్తు చేశారు. విజయదశమి రోజు పెద్దకోట్లలో షర్మిల పెద్దమ్మగుడికి వెళ్లి పూజలు జరిపారు.
షర్మిల పాదయాత్ర వంద కిలోమీటర్లు పూర్తి చేసుకున్నసందర్భంగా వైయస్ఆర్ సీపీ శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తాడిమర్రిలో మాట్లాడుతూ చంద్రబాబుది దొంగయాత్ర, అబద్ధపు యాత్ర అన్నారు. చంద్రబాబు విశ్వసనీయత, పరపతీ పోగొట్టుకున్న నేత కాగా, షర్మిల యాత్రకు అద్భుత ప్రజాస్పందన వస్తోందనీ ఆయన వ్యాఖ్యానించారు.

Back to Top