మాజీ రాష్ట్ర‌ప‌తి అబ్దుల్ క‌లాం క‌న్నుమూత‌


దేశం గ‌ర్వించ‌ద‌గిన శాస్త్ర‌వేత్త, మాజీ రాష్ట్ర‌ప‌తి అబ్దుల్ క‌లాం క‌న్నుమూశారు. త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన విద్యార్థుల‌కు బోధ‌న అందిస్తుండ‌గానే ఆయ‌న సెల‌వు తీసుకొన్నారు. షిల్లాంగ్ లోని ఐఐఎమ్ లో ఆయ‌న ఈ సాయంత్రం గెస్ట్ లెక్చ‌ర్ ఇస్తున్నారు. ఆ వేదిక మీద ప్ర‌సంగిస్తుండ‌గానే ఒక్క‌సారిగా ఆయ‌న అస్వ‌స్థ‌త‌కు లోనై కుప్ప‌కూలారు. ఆ వెంట‌నే ఆయ‌న్ని సైనిక బ‌ల‌గాలు స్తానిక ఆసుప‌త్రి కి తీసుకొని వెళ్లారు. అక్క‌డ ఐ సీ యూ లో చికిత్స అందిస్తుండ‌గా క‌న్ను మూశారు.
త‌మిళ‌నాడులోని రామేశ్వ‌రంలో నిరుపేద కుటుంబంలో ఆయ‌న జ‌న్మించారు. తండ్రికి సాయం చేస్తూ, చిన్న చిత‌క ప‌నులు చేస్తూ స్వ‌యం శ‌క్తితో ఆయ‌న ఇంజ‌నీరింగ్ చ‌దువుకొన్నారు. త‌ర్వాత సైనిక బ‌ల‌గాల‌కు సేవ‌లు అందించే డిఫెన్స్ ల్యాబ‌రేట‌రీల్లో సుదీర్ఘ కాలం ప‌ని చేశారు. భార‌తీయ క్షిప‌ణి పితామ‌హుడుగా ఆయ‌న పేరు గాంచారు. త‌ర్వాత ఆయ‌న్ని భార‌త రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి వ‌రించింది. ఐదేళ్ల పాటు రాష్ట్ర‌ప‌తిగా వివాదాల‌కు దూరంగా సేవ‌లు అందించారు. త‌ర్వాత కాలంలో ఆయ‌న అనేక విశ్వ విద్యాల‌యాల‌కు అతిథి అద్యాప‌కుడిగా బోద‌న‌లు అందిస్తున్నారు. 
చిన్నారుల‌ను ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే అబ్దుల్ క‌లాం అనేక పాఠ శాల‌ల్ని సంద‌ర్శించారు. భార‌తీయ సంస్కృతిని అమితంగా ప్రేమించే క‌లాం..అనేక రంగాల్లో నైపుణ్యం గ‌డించారు. చిన్నారులు ఎక్క‌డ ఉన్నా ఉత్సాహంగా ప‌ల‌క‌రించి వారిని ప్రోత్స‌హించేవారు. 
Back to Top