ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకోసం టీడీపీ అడ్డదారులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అత్యంత అవినీతిపరుడుతనపై ఆరోపణలకు కట్టుబడి ఉన్నా..దమ్ముంటే నిరూపించాలిసోమిరెడ్డికి కాకాణి గోవర్థన్‌రెడ్డి సవాల్నెల్లూరుః సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తనపై చేసిన అవినీతి ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, ధైర్యం ఉంటే ఆ ఆరోపణలు రుజువు చేయాలని వైయస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి సవాల్ విసిరారు. అడ్డంగా అవినీతికి పాల్పడుతున్న సోమిరెడ్డి తాను ఏమీ తప్పులు చేయనట్లు మాట్లాడడం మానుకోవాలన్నారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి కాకాని విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణం తనను కలిచివేసిందని కాకాణి పేర్కొన్నారు. భూమాకు సంతాపం ప్రకటించి, కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు.
ఓటర్లను బెదిరిస్తున్న టీడీపీ నేతలుస్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనేక అక్రమ మార్గాలను అనుసరిస్తోందని కాకాణి మండిపడ్డారు. ప్రతిపక్ష వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను టీడీపీలోకి లాక్కుంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ విధి విధానాలు నచ్చక వైయస్ఆర్ సీపీలో చేరుతున్న ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు పెడతామంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకోసం టీడీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారని దుయ్యబట్టారు. మూడు సంవత్సరాలుగా స్థానిక ప్రజాప్రతినిధులకు ఎటువంటి అధికారాలు లేకుండా చేసిన చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా చేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.