కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే తనయుడి చేరిక

హైదరాబాద్:

మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కె. గురునాథ్‌రెడ్డి కుమారుడు జగదీశ్వర్‌రెడ్డి (జగ్గప్ప) తన అనుచరులతో కలసి వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటైన ఓ కార్యక్రమంలో గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, తనకు తొలి నుంచి వైయస్ రాజశేఖరరెడ్డి, వైయస్ జగన్మోహన్‌ రెడ్డి అంటే చాలా అభిమానమనీ, అందుకే పార్టీలో చేరుతున్నాననీ తెలిపారు. తమ నియోజకవర్గంలో ప్రజాభిప్రాయం కూడా వైయస్ఆర్ కాంగ్రెస్‌కు పూర్తి అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. జగదీశ్వర్‌ రెడ్డి తండ్రి కె. గురునాథ్‌ రెడ్డి కొడంగల్ నుంచి ఐదుసార్లు కాంగ్రెస్ తరపున శాసనసభకు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు ఎంవీ మైసూరారెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top