కాంగ్రెస్ కార్యకర్తలా గవర్నర్ ప్రసంగం

హైదరాబాద్, 13 మార్చి 2013:

గవర్నరు ప్రసంగం కాంగ్రెస్ కార్యకర్త ప్రసంగంలా ఉందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు.  శాసన సభ సమావేశాలకు హాజరైన ఆయన గవర్నర్ నరసింహన్ ప్రసంగం అనంతరం మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడారు. గవర్నరు ప్రసంగం ఊకదంపుడుగా ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అభివర్ణించారు. ప్రజల సమస్యల గురించి బాధల గురించి ప్రస్తావన లేనే లేదన్నారు. 2009 ప్రసంగానికి ఇప్పటి ప్రసంగం నకలుగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమన్యాయం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని తన ప్రసంగంలో పేర్కొన్న గవర్నర్ ఆయా పథకాలు ప్రజలకు అందని విషయాన్ని విస్మరించారని భూమన చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్టును యథాతథంగా చదివారని చెప్పారు. మహిళలను లక్షాధికారులను చేస్తానని ప్రగల్భాలు పలికిన ఈ ప్రభుత్వం వాస్తవానికి ఏ ఒక్క మహిళ కన్నీటినీ తుడవలేకపోయిందన్నారు.

రాజుగారు ఫిడేలు వాయిస్తున్నట్టుగా గవర్నరు ప్రసంగం సాగిందని మరో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితులను, ప్రజల ఇబ్బందులనూ తన ప్రసంగంలో తెలియచేయాల్సిన అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. రేట్లు పెరిగి, కరెంటు లేక, ఇంకా అనేక ఇక్కట్లను ఎదుర్కొంటుంటే..ప్రజలు కారుస్తున్నవి కన్నీళ్ళు కాదు.. ఆనందబాష్పాలు అన్న రీతి గవర్నరు ప్రసంగం సాగిందని మరో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. అందరికీ విద్యనందిస్తామంటున్న ప్రభుత్వం ఏ స్కూల్లోనూ టీచరు లేని అంశాన్ని విస్మరించిందన్నారు. చివరికి మూత్రశాలలు కూడా లేవన్నారు. అలాగే ఆస్పత్రులలో మందులు లేవనీ, గవర్నరు ప్రసంగం అబద్ధాల పుట్ట అని ఆయన విమర్శించారు.

Back to Top