జనహారం.. ఇడుపులపాయ వనం

జనం.. జనం.. అభిమాన సంద్రం.. జనం రావాలంటే నేలే ఈనక్కర్లేదని నిరూపించారు మహానేత అభిమానులు. డాక్టర్ వైయస్ఆర్ తనయ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానానికి రాష్ట్రంనలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలివచ్చారు.
ఇడుపులపాయ: వైయస్ఆర్ కుటుంబంపై పాలకవిపక్షాల కుట్రలను దునుమాడే వేదికగా మారింది ఇడుపులపాయ. వైయస్ఆర్ ఘాట్‌లో సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్న అనంతరం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, తనయ షర్మిల  మరో ప్రజాప్రస్థానానికి శంఖం పూరించారు. షర్మిల వెంట వైయస్ విజయమ్మ, జగన్ సతీమణి వైయస్ భారతి, ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి, పార్టీ నేతలు రోజా, వాసిరెడ్డి పద్మ ఉన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వైయస్ అభిమానులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఇడుపులపాయను జన సాగరంగా మార్చారు.  ఆమె వెంట 11 కిమీ మేర అనుసరించారు. ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. రోడ్డుపై చోటు లేక ప్రజలు పొలాల్లోంచి నడుచుకురావడం కనిపించింది. 
సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన అభిమానులు: అనంతపురం జిల్లానుంచి వచ్చామని ఓ యువతి చెప్పారు. పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయడానికి వచ్చామని ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన ఓ వ్యక్తి చెప్పారు. వైయస్ఆర్ చేసిన పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చిందని కడప పట్టణం నుంచి వచ్చిన ఓ అభిమాని తెలిపారు. ఏ మహిళా ఇటువంటి కార్యాన్ని తలపెట్టలేదన్నారు. వైయస్ పథకాలను జగన్ తిరిగి తెస్తారన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తంచేశారు. జగన్ అభిమానుల మనీ, పాదయాత్ర చూసేందుకు వచ్చామనీ వేంపల్లె నుంచి వచ్చిన వారు చెప్పారు. ప్రకాశం జిల్లా దర్శి నుంచి విచ్చేసిన మరో వ్యక్తి మాట్లాడుతూ షర్మిలను అభినందించేందుకు ఇక్కడికి వచ్చానని పేర్కొన్నారు. 
సర్వమత ప్రార్థనల అనంతరం షర్మిల.. ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో ముచ్చటించారు. వారి సమస్యలను ఓపికగా విన్నారు. ట్రిపుల్ ఐటీలో సౌకర్యాలు లేవనీ, ఈ కారణంగా ఫలితాల సాధనలో వెనుకబడే అవకాశముందనీ వారు ఆమె దృష్టికి తెచ్చారు. వైయస్ఆర్ ఉన్నప్పుడు తరచూ ఇక్కడికి వచ్చి అన్నీ తెలుసుకునే వారనీ, తెలుగు పద్యాలు చెప్పించుకునే వారనీ ఆమెకు వివరించారు. ఇక్కడున్న పిల్లల ఇబ్బందులు అర్థంచేసుకున్నానని షర్మిల వారితో చెప్పారు. గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విద్యనందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ట్రిపుల్ ఐటీని ప్రారంభించారు. ఆరేళ్ళలో ఇంజనీర్లుగా చూడాలనుకున్నారు. ప్రత్యేక శ్రద్ధ చూపేవారని చెప్పారన్నారు. కష్టాలు తీరాలంటే రాజన్న రాజ్యం రావాలనీ,  జగనన్నతోనే అది సాధ్యమనీ షర్మిల వారికి చెప్పారు. అవకాశం వచ్చినపుడు మీ తడాఖా చూపాలని కోరారు. ఆమె ప్రసంగిస్తున్నంతసేపు విద్యార్థులు తమ కేరింతలతో స్పందించారు. 

Back to Top