జనాదరణ ఓర్వలేకే కుట్రలు: షర్మిల

శివరాంపేట:

మరో ప్రజాప్రస్థానంలో భాగంగా ఉరవకొండ నియోజకవర్గంలోని ఉదిరిపికొండ నుంచి షర్మిల గురువారం మధ్యాహ్నం శివరాంపేటకు చేరుకున్నపుడు అక్కడ ఆమెకు గ్రామ ప్రజలు ఆత్మీయంగా స్వాగతం పలికారు. బంతిపూల వర్షం కురిపించారు. అక్కడ గ్రామీణుల సమస్యలను తెలుసుకున్న తర్వాత షర్మిల మాట్లాడుతూ.. ‘జగన్ కాంగ్రెస్‌లో ఉంటే ఇన్ని కష్టాలు పడి ఉండేవారు కాదని గులాంనబీ ఆజాద్ అనడాన్ని బట్టి చూస్తే కక్ష సాధింపుల్లో భాగంగానే  కాంగ్రెస్ ఆయనను అరెస్టు చేయించారన్న విషయం అర్థమవుతోందని చెప్పారు. టీడీపీతో కుమ్మక్కైన కాంగ్రెస్ జగనన్నను ప్రజలకు దూరం చేస్తోందనీ, జగనన్నకు ఉన్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ఈ కుట్రలు పన్నుతున్నారనీ స్పష్టంచేశారు. 'ఏదో ఒక రోజు జగనన్న బయటకు రాకపోరు.. మీ తరఫున పోరాటం చేయకపోరు.. రాజన్న రాజ్యాన్ని స్థాపించకపోరు.. మీ కష్టాలను కడతేర్చకపోరు.. ఓపికపట్టండి’ అంటూ ధైర్యం చెప్పారు. శివరాంపేట నుంచి భంభంస్వామి గుట్ట వద్దకు రాత్రి 7.30 గంటలకు చేరుకున్నారు. షర్మిల అక్కడే బస చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షంలోనూ వేలాది మంది ప్రజలు షర్మిలను అనుసరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది కాంగ్రెస్, టీడీపీ శిబిరాలను మరింత ఆందోళనకు గురిచేసింది. గురువారం షర్మిల మొత్తం 13 కిలోమీటర్ల దూరం నడిచారు.

Back to Top