జగన్‌పై రాజకీయ కుట్ర: సోమయాజులు

హైదరాబాద్, 5 అక్టోబర్‌ 2012: ఏవిధమైన ఆధారాలు లేకుండా, అకారణంగా జగన్‌ను అరెస్టు చేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల సలహాదారు డి.ఎ. సోమయాజులు ఆరోపించారు. ఈ రోజుకూ ఆయనపై అభియోగాలే తప్ప ఆధారాలు లేవని ఆయన అన్నారు. సిబిఐ అధికారులు ఇంతకు ముందు న్యాయవాదిని అనవసరంగా మార్చివేశారని, ఈ కేసుతో సంబంధం లేని కొత్త న్యాయవాదిని తీసుకువచ్చారని ఆరోపించారు. ఎంతో ప్రాముఖ్యం ఉన్న బెయిల్‌ కేసు ఇది అని దీనికి సంబంధించిన పిటిషన్‌పై విచారణ సుప్రీం ధర్మాసనం ముందుకు వచ్చినప్పుడు సిబిఐ కోర్టులో, హైకోర్టులోనూ వాదించిన అశోక్‌ భాన్‌ అక్కడే ఉన్నప్పటికీ వాదించడానికి నిరాకరించడాన్ని ఆయన తప్పుపట్టారు. శుక్రవారంనాడు ఆయన సాక్షి చానల్‌లో మాట్లాడుతూ అనేక అంశాలను ప్రస్తావించారు.

జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌ వ్యవహారం సెప్టెంబర్‌ 15 నుంచి మొదలైందని, ఆయనను మే 27న అకారణంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ను అరెస్టు చేసి ఇప్పటికే 130 రోజులైందని అన్నారు. ఆయనను అకారణంగా అరెస్టు చేశారని, ట్రయలే మొదలు కాకుండా, ఆధారాలు చూపించకుండా, బెయిల్‌ ఇవ్వకుండా ఇన్నిన్ని రోజులు జగన్‌కు బెయిల్‌ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. రిమాండ్‌ నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మే 23, 24, 25, 26 తేదీల్లో జగన్‌ను పిలిచామని, మేం అడిగిన దానికి ఆయన పూర్తిగా జవాబులు చెప్పలేదని, ఆయన తప్పించుకుంటున్నారని సిబిఐ పేర్కొందని ఇది పూర్తిగా చట్ట విరుద్ధమన్నారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 20 సబ్‌ ఆర్టికల్‌ 3 ప్రకారం ప్రతి నిందితుడికి, ఏ క్రిమినల్‌ కేసులో ఉన్న వారికైనా వాళ్ళకి 'మౌనంగా ఉండే హక్కు' (రైట్‌ టు సైలెన్సు') ఉందని చాలా స్పష్టంగా ఉందన్నారు. ఇది చాలా గొప్ప విషయమని, లా కమిషన్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక కూడా దీనిపై ఈ మధ్యనే చాలా స్పష్టంగా వివరణ ఇచ్చిందని పేర్కొన్నారు. రైట్‌ టు సైలెన్సు అనేది చాలా గౌరవనీయమైన హక్కు అని అది తెలిపిందన్నారు. ఏ నిందితుడినీ కూడా తాము అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పలేదనే మిష మీద అరెస్టు చేయడానికి వీల్లేదని చెప్పిందన్నారు. ఆర్టికల్‌ 19 ప్రకారం రైట్‌ టు స్పీచ్ ఎంత ముఖ్యమైనదో ఆర్టికల్‌ 20 కింద రైట్‌ టు సైలెన్సు కూడా అంతే ప్రాధాన్య గలదన్నారు.

శంకర్రావు, టిడిపి వాళ్ళు కలిసి కేసు వేయడమేమిటన్నది చాలా ఆశ్చర్యకరమైన విషయమని సోమయాజులు వ్యాఖ్యానించారు. ఆక్కడి నుంచి మొదలు ఈ రోజు దాకా జరుతున్న పరిణామాలన్నీ కాంగ్రెస్‌, టిడిపిలు జగన్మోహన్‌రెడ్డిని రాజకీయాల నుంచి దూరం చేయాలని చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే అని ఆరోపించారు. ఇంతకు ముందు హైకోర్టులో కేసు విచారణకు వచ్చినప్పుడు హఠాత్తుగా సప్లిమెంటరీ చార్జిషీట్‌ అని సిబిఐ తీసుకువచ్చిందని, 2009 నుంచీ చెబుతున్న ప్రతి విషయాన్నే మళ్ళీ ఉటంకించిందని ఎద్దేవా చేశారు. ఇది చాలా అన్యాయమైన కేసని, అందరినీ భయభ్రాంతులకు గురిచేసి అందరినీ ప్రభావితం చేసేలా సిబిఐవారు చేశారప్పుడు. ముందేమో లాయర్‌ను వాడుకున్నారు. అంతకు ముందేమో ఇంకో కారణంగా విచారణను వాయిదా వేయించారు. ఇప్పుడేమి చెబుతున్నారు? హిందూ తదితర జాతీయ పత్రికల్లో హెడ్‌లైన్లలో వచ్చేలా చేసి న్యాయవ్యవస్థను కూడా ప్రభావితం చేసేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

న్యాయవ్యవస్థను ప్రభావితం చేయాలన్న ఏకైక లక్ష్యంతో సిబిఐ వ్యవహరిస్తోందని సోమయాజులు అన్నారు. అయితే, న్యాయవ్యవస్థ ప్రభావితం అవుతుందనుకోవడంలేదన్నారు. ఇండియన్‌ జ్యుడిషియరీ ఈజ్‌ వన్‌ ఆఫ్‌ ద బెస్టు‌ జ్యుడిషియరీస్. ‌న్యాయం కొన్నాళ్ళు ఆలస్యం కావచ్చేమో కాని డినయల్‌ ఆఫ్‌ జస్టిస్‌ అనేది ఉండదనేదాన్ని సంపూర్ణంగా నమ్ముతానన్నారు. ఇది పొలిటికల్ కేసు అని, రాజకీయంగా జగన్మోహన్‌రెడ్డిని ఎదుర్కోలేక ఆయన మీద ఆధారాలు లేని కేసులన్నీ పెట్టి హింసకు గురిచేస్తున్న విషయం అందరికీ తెలుసన్నారు. విజయమ్మే కాదు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనే కాదు ఎవళ్ళయినా మధ్యస్థంగా ఉండే వారికి ఇది ఆన్యాయమైన కేసు అని స్పష్టంగా తెలుస్తుందన్నారు.

'ఈడీ విడుదల చేసిన నోటిసును గమనిస్తే 150, 160 రోజుల క్రితం ఫైల్‌ చేసిన మొదటి చార్జిషీట్‌లోని విషయాలే ఉన్నాయి. ఇన్ని రోజులు ఎందుకు ఆగాల్సి వచ్చింది? దాని తరువాత ఈడీ కొత్తగా పరిశోధించిన విషయాలు ఇవి అని చెప్పాలి కదా. విచిత్రమైన విషయం ఏమిటంటే ఈడీ నోట్‌లు చదివితే 22 కోట్ల రూపాయలు ఈ కంపెనీలకు ఫలితం చేకూరిందని, దానికి ప్రతిఫలంగా 29 కోట్ల రూపాయలు లంచం బదులు ఇన్వెస్టుమెంట్‌ చేశారని ఉంది. ఈ ప్రపంచ చరిత్రలో 22 కోట్ల లబ్ధి కోసం 29 కోట్ల రూపాయలు లంచం ఇవ్వడం ఎక్కడైనా జరుగుతుందా? బుద్ధి, జ్ఞానం ఉన్నవాడెవడైనా అలాంటి పనులు చేస్తారా? అసలు ఏ రకంగా వాళ్ళు ఇలా ఊహించగలుగుతారు? ఇంత పెద్ద సెంట్రల్‌ గవర్నమెంట్‌ను, వాళ్ళను వాళ్ళు ఏ విధంగా అవమానించుకుంటున్నారో. కేవలం ఒకడిని అవమానిద్దామని, ఇబ్బందులు పెడదామని వాళ్ళకు వాళ్ళు అవమానించుకుంటున్నారు వాళ్లు' అని నిప్పులు చెరిగారు.

'క్రిమినల్‌ కుట్ర అంటే లంచం బదులు వాళ్ళు జగన్‌ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని సిబిఐ అధికారులు అంటున్నారు. వారు మర్చిపోతున్నవిషయం ఏమంటే హెటిరో డ్రగ్సు కాని, అరబిందో ఫార్మా కాని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంస్థలు. ముఖ్యంగా అరబిందో లిస్టెడ్‌ కంపెనీ. భారతదేంలో ఆంధ్రప్రదేశ్‌కు గౌరవం తీసుకువచ్చిన అతి కొద్ది కంపెనీల్లో డాక్టర్ రెడ్డి ‌లేబొరేటరీస్ ఒకటి. వాళ్ళకు భూమి కావాలంటే వంద కిలోమీటర్ల అవతల ఎకరం లక్ష ఖరీదు చేసే భూమిని ఏడు లక్షల రూపాయలకు ఇచ్చారు. కాలుష్య కారక పరిశ్రమ కనుక వారు మరో మాట మాట్లాడకుండా తీసుకున్నారు. తాను ఏపిఐడిసి కార్యదర్శిగా చాలా కాలం పనిచేసి 1500 కంపెనీలను ఆంధ్రప్రదేశ్‌లో ప్రమోట్‌ చేసిన'ట్లు సోమయాజులు చెప్పారు.

చంద్రబాబు భార్య 1999లో కోటి రూపాయలకు అమ్ముకున్నారని, దాని పక్కన ఉన్న భూమిని 2002లో 22 లక్షలకు చంద్రబాబు అమ్మారని సోమయాజులు గుర్తు చేశారు. దీని మీద కేసులు లేవని, మాట్లాడినవారు లేరని అన్నారు. ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు ఐఎంజీ సంస్థకు ఒక్కో ఎకరం పది కోట్లకు తక్కువ ఉండని విలువైన 850 ఎకరాలను ఎకరం 50 లక్షలకే అమ్మేశారని పేర్కొన్నారు. అవన్నీ తప్పుకాదన్నట్లు చెబుతూనే ఒక జెన్యూన్‌ పరిశ్రమకు లక్షరూపాయల విలువైన భూమిని ఏడు లక్షలకు ఇస్తే అదేదో భయంకరమైన ఫలితం చేకూరిందని అంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిఫలంగా వాళ్ళు తీసుకువచ్చి 29 కోట్ల రూపాయలు జగన్మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టారనడం సరికాదు. ఆ సొమ్ములు ఎవరి పేరు మీద ఉన్నాయి. అరబిందో, హెటిరో డ్రగ్సు పేరు మీదనే షేర్ల రూపంలో ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు కావలిస్తే అప్పుడు అమ్ముకోవచ్చు. ఆ ప్రీమియం కూడా కంపెనీల్లోనే ఉందని తెలిపారు.

వారు తీసుకొచ్చి ఇచ్చిన ప్రీమియంను జగన్‌ దుర్వినియోగం చేశారంటే అది వేరే విషయం. లేదా జగన్మోహన̴్రెడ్డి కంపెనీలు దురుద్దేశంతో రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు గాని, ఆదాయ పన్ను శాఖకు గాని ఇలాంటి పెట్టుబడులు వచ్చాయని చెప్పకపోతే తప్పవుతుందన్నారు. 2009లోనే జగన్మోహన్‌రెడ్డి ఇవన్నీ కూడా రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు, ఆదాయపన్ను శాఖకు, లోక్‌సభ సెక్రటేరియట్‌కు, ఎన్నికల సంఘానికి ఇచ్చిన ప్రతి అఫిడవిట్‌లోనూ పేర్కొన్న విషయాలే. ఇదేమీ కొత్తగా సిబిఐ వాళ్ళో, ఈడీనో, లేదా చంద్రబాబు నాయుడో కొత్తగా చెప్పినది కాదు. జగన్‌ వెల్లడించిన విషయాలకే వీళ్ళంగా కొత్తగా భాష్యం చెబుతున్నారు. వీళ్ళు కనుక్కున్నదేంటి? సామాన్య ప్రజలకు అర్థం కాదని ఇదేదో భయంకరమైన బ్రహ్మపదార్థాన్ని మేమే కనుక్కున్నామన్నట్లు చెప్పుకుంటున్నారు. మొత్తం విషయాన్ని గందరగోళంగా మార్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టిడిపి, కాంగ్రెస్‌ వాళ్ళు కలిసి ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడం ఏమిటి? అని సోమయాజులు ప్రశ్నించారు. జగన్‌ విషయంలో ఆ రెండు పార్టీలు ప్రత్యక్షంగానే కుట్రలు పన్నుతున్నాయని అందరికీ తెలిసిన విషయమే అన్నారు. మొన్న 18 అసెంబ్లీ స్థానాలు, ఒక ఎంపి స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో సగం సీట్లలో కాంగ్రెస్‌కు, సగం సీట్లలో టిడిపికి ఆఖరికి డిపాజిట్లు దక్కలేదని ఎద్దేవా చేశారు. అంతకు ముందు ఒక పార్టీకి 40 శాతం, మరో దానికి 38 శాతం ఓట్లు వచ్చాయి. ఉప ఎన్నికల్లో టిడిపి 20 శాతం, కాంగ్రెస్‌ 25 శాతం ఓట్లు కోల్పోయాయి. అవి రెండూ కలిపి జగన్మోహన్‌రెడ్డికి వచ్చాయి. తద్వారా వాళ్ళకి రాజకీయ భవిష్యత్తంగా గల్లంతైందన్నారు. 2009 నుంచి 45 సార్లు ఉప ఎన్నికలు జరిగాయి. ఒక్క ఉప ఎన్నికలో కూడా టిడిపి గెలవలేదని, దీనితో సహజంగానే వాళ్ళు నిరాశలో ఉన్నారు. టిడిపి వాళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ గెలవలేక ఫ్రస్టేషన్‌లో ఉన్న కాంగ్రెస్తో కలిశారు. ఈ విషయాన్ని ప్రతి ప్రతిపక్ష పార్టీ చెబు‌తోంది. కాంగ్రెస్‌ పార్టీ సిబిఐ, ఈడీ లాంటి సంస్థలను దుర్వినియోగం చేస్తున్నాయని మమతా బెనర్జీతో సహా అనేక మంది చెబుతున్న విషయాన్ని ఆయన ఉటంకించారు.

సిబిఐ తరఫు న్యాయవాది మార్చగల శక్తి వైయస్‌ పార్టీకి, జగన్మోహన్‌రెడ్డికే ఉంటే ఆయనపై కేసు ఎందుకుంటుందని సోమయాజులు ప్రశ్నించారు. ఆయన జైలులో ఎందుకు ఉండాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. అదనపు సొలిసిటర్‌ జనరల్‌ను తమ ఇష్టం వచ్చినట్లు తాము నియమించుకునే శక్తి ఉంటే అసలు కేసు ఎందుకు ఉంటుందని అన్నారు. ఆయనను జైలులో ఎందుకు పెడతారని అన్నారు. 
జగన్‌ కోర్టే జైలులో పెట్టిందనడం సరి కాదు. అతనిని జైలులో పెట్టకపోతే ఈ కేసులో మేం దెబ్బ తింటామని సిబిఐ చెబితే కోర్టు సరే అని ఒప్పుకుంటుంది తప్ప కోర్టు తనంతట తానే జగన్‌ను జైలులో పెట్టమనలేదు కదా. ఇది చాలా మందికి తెలియని విషయం.

అదే సిబిఐ సెప్టెంబర్‌ 7న కౌంటర్‌ ఫైల్‌ చేసింది. మొన్న న్యాయవాదిని మార్చినప్పటికి సిబిఐ దాఖలు చేసిన కౌంటర్‌ ఆధారంగానే వాదించాలి కదా. న్యాయవాదిని మార్పించడమనేది టిడిపి వాళ్ళు చేసిన నీచాతి నీచమైన అభియోగం తప్ప మరొకటి కాదన్నారు.‌ జగన్మోహన్‌రెడ్డిని జైలులో పెట్టి 90 రోజులు పూర్తయింది కనుక ఏదో విధంగా బెయిల్ వస్తుంది. ఈ బెయిల్‌ వస్తే కాంగ్రెస్‌తో కుమ్మక్కయి తెచ్చుకున్నారంటూ దుష్ప్రచారం చేసిందని దుయ్యబట్టారు.

ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటుందని, టిడిపి నుంచి కనీసం 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారని టిడిపి నాయకులకు తెలుసు. వైయస్‌ఆర్‌ సిపి కాంగ్రెస్‌తో కుమ్మక్కైపోయిందని, మీరు అక్కడికి వెళ్ళినా సీట్లు ఉండవని చెప్పి తమ ఎమ్మెల్యేలు, క్యాడర్‌ను కాపాడుకోవడానికి ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నం తప్ప మరొకటి కాదన్నారు. వారు చెబుతున్న దానిలో ఒక్క నిజం కూడా లేదు. వారికి ఏవో కొన్ని మీడియా సంస్థలు మద్దతుగా ఉన్నాయని అబద్ధాలు ప్రచారం చేయొచ్చు. జాతీయ పేపర్లలో కూడా పతాక శీర్షికలు వేయించుకున్నారని, ఏదైనా వీలుంటే జడ్జిని ప్రభావితం చేయొచ్చని వాళ్ళు చూస్తున్నారని సోమయాజులు ఆరోపించారు.

కోర్టులో ఉన్నది జగన్‌ అక్రమ ఆస్తుల కేసు కాదన్నారు. ఆస్తుల కేసు కూడా కాదన్నారు. 'సాక్షి' టివిలో చూపిస్తున్నది కూడా తప్పే అన్నారు. ఈ కేసులో ప్రధానమైన అభియోగం 2004 నుంచి 2009 వరకూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 26 జివోలే కాకుండా మరికొన్ని ఆర్డర్లు జారీ చేసిందని, ఇవన్నీ రూల్సు, రెగ్యులేషన్లకు, కన్వెన్షన్లు, ప్రెసిడెంట్సుకు వ్యతిరేకంగా చేశారని, ఇవన్నీ ఇల్లీగల్‌గా ఎవరో కొందరికి ఫలం చేకూర్చేటట్టుగా ఇచ్చిన జివోలు ఇచ్చారన్నది. ఆ సమయంలో వైయస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక దానికి ప్రతిఫలంగా ఆయన కుమారుడు జగన్‌ సంస్థల్లో కొంతమంది షేర్లు పెట్టారన్నది అభియోగం. కేసు పూర్వాపరాలు చూస్తే ఆ 26 జివోలకు సంబంధించిందే తప్ప జగన్‌ ఆస్తులకు సంబంధించింది కాదని సోమయాజులు స్పష్టం చేశారు.

ఈ కేసులో జగన్‌ మొదటి ముద్దాయి కాదన్నారు. 52వ ప్రతివాది అని అన్నారు. మొదటి ప్రతివాది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. నెంబర్‌ టూ పరిశ్రమల కార్యదర్శి. నెంబర్‌ త్రీ హోం కార్యదర్శి. ఈ 26 జివోలు కరెక్టా కాదా అన్నప్పుడు ముందుగా వాటిని జారీ చేసిన వారిని అరెస్టు చేయాలన్నారు. ఎఫ్‌ఆర్‌ఆర్‌ నమోదు చేసిన కొన్ని గంటల వ్యవధిలో 28 సిబిఐ బృందాలు జగన్‌ ఇల్లే కాకుండా ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారందరి ఇళ్ళు, ఆఫీసులలోనూ దాడులు చేశాయి. జివో కరెక్టా కాదా అనేది తేల్చకుండా ఏ చర్యలేమిటని నిలదీశారు.‌ ఇంత చేసినా జగన్ చెప్పని విషయం ఏదైనా వాళ్ళు కనుగొన్నారా? అంటే అలాంటిదేమీ లేదని అన్నారు.

ఈ 13 నెలలు వందల మందిని భయభ్రాంతులకు గురిచేయడం తప్ప సిబిఐ సాధించిందేమిటి? చట్ట విరుద్ధంగా సిబిఐ వ్యవహరిస్తోందని, జగన్‌ను విచారణకు పిలిస్తే మేం చెప్పమన్నట్లుగా ఆయన చెప్పలేదని అరెస్టు చేయడమే చట్ట విరుద్ధం అన్నారు. ఆయనను అరెస్టు చేసిన విధానమే శుద్ధ తప్పు అని ఖండించారు. రాజ్యాంగాన్ని సీబిఐ అపహాస్యం చేస్తోందన్నారు. ఆగస్టు 25 నాటికే జగన్‌ను జైలులో పెట్టి 90 రోజులు పూర్తయిందని, ఈవేళ బెయిల్‌ విచారణకు వస్తోందన్నారు. ఏదన్నా ఒక ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దాని కింద ఎవరైనా ఒకరిని అరెస్టు చేస్తే 90 రోజుల్లోపల దర్యాప్తు పూర్తి చేయకపోతే ఆటోమేటిక్‌గా అతనికి బెయిల్‌ వస్తుందని క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్ సెక్షన్‌ 167 చాలా స్పష్టంగా చెబుతోందన్నారు. ఇది చాలా ముఖ్యమైన సెక్షన్‌ అన్నారు.

సిపిసిలోని 173వ సెక్షన్ చార్జిషీట్‌ గురించి వివరిస్తున్న‌దన్నారు. సుప్రీంకోర్టులో సిబిఐ స్వాన్‌ అఫిడవిట్‌ను సెప్టెంబర్‌ 7న ఫైల్‌ చేసిందని, దానిలోని 11వ పేరాలో తాము దర్యాప్తు ఇంకా పూర్తి చేయలేదని తనకు తానే చెప్పిందన్నారు. ఇందులో మిగిలిన రెండు విషయాలేమిటంటే, ఒక ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేశారు. దాని కారణంగా జగన్మోహన్‌రెడ్డిని మే 27న అరెస్టు చేశామని చెప్పారు. దేనికోసం ఆయనను అరెస్టు చేశారో రిమాండ్‌ రిపోర్టులో పదో పదో డిస్టింక్టు అఫెన్సెస్‌ చూపెట్టారు. దాని గురించి దర్యాప్తు పూర్తి కాలేదని చెప్పారు. అంతకు ముందు హైకోర్టులో జస్టిస్‌ చంద్రకుమార్‌ దగ్గరకు వెళ్ళినప్పుడు 90 రోజులు దాటితే జగన్‌కు తప్పకుండా బెయిల్‌ వస్తుందని చాలా స్పష్టంగా చెప్పారన్నారు. జగన్‌కు ఈ రోజు బెయిల్‌ వస్తుందని నమ్మే వారిలో తానూ ఒకడిని అని సోమయాజులు తెలిపారు.

Back to Top